ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్‌వార్‌

6 Jul, 2018 11:39 IST|Sakshi
అమెరికా, చైనాల మధ్య ట్రేడ్‌ వార్‌

బీజింగ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేల్చిన ట్రేడ్‌వార్‌ బుల్లెట్‌పై చైనా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది ఆర్థిక చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్‌వార్‌గా అభివర్ణించింది. 34 బిలియన్‌ డాలర్ల చైనా ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లను ఈ అర్థరాత్రి నుంచి అమల్లోకి తీసుకురానున్నట్టు అమెరికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో చైనా తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు అంతే స్థాయిలో తాము చర్యలు తీసుకోనున్నామని బీజింగ్‌ వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అమెరికా ఎగుమతులపై అంతేమొత్తంలో టారిఫ్‌లను విధించనున్నామని అంతకముందే బీజింగ్‌ హెచ్చరించింది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాల మధ్య టారిఫ్‌ వార్‌ ఉధృతమవడంతో, ప్రపంచవ్యాప్తంగా కన్జ్యూమర్లు, కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన జోన్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరో 16 బిలియన్‌ చైనీస్‌ ఉత్పత్తులపై కూడా 25 శాతం టారిఫ్‌లు విధించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికాకు కౌంటర్‌ కచ్చితంగా ఇస్తామంటూ చైనా ప్రతిజ్ఞల మీద ప్రతిజ్ఞలు చేస్తోంది. ఒకవేళ బీజింగ్‌ నుంచి ఏమైనా ప్రతీకార చర్యలు వస్తే, తమ అడ్మినిస్ట్రేషన్‌ ఏమీ చూస్తూ ఊరుకోదని మరోవైపు నుంచి ట్రంప్‌ చెబుతున్నారు. దీనికి ఓ ముగింపు వచ్చేంత వరకు ట్రేడ్‌ వార్‌ ఆగదని కూడా చైనా చెబుతోంది. ఈ హెచ్చరికలను చూస్తే దెబ్బకు దెబ్బ అనే రీతిలో పెద్ద ఎత్తునే ట్రేడ్‌ వార్‌ను విజృంభించేలా ఉందని సీఎన్‌ఎన్‌ రిపోర్టు చేసింది. కేవలం చైనాతో మాత్రమే కాకుండా... అమెరికా దేశం యూరోపియన్‌ యూనియన్‌, కెనడా దేశాలతో కూడా ట్రేడ్‌ వార్‌ కొనసాగిస్తోంది. ఆయా దేశాల నుంచి దిగుమతి అయ్యే స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తులపై టారిఫ్‌లను విధించింది. వీటికి ప్రతీకారంగా కెనడా, ఈయూలు కూడా సుంకాలు విధించాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ మరింత ఉధృతమవుతుంది. 

మరిన్ని వార్తలు