భారత్‌కి ఏటా 1.8 లక్షల కోట్ల నష్టం!

16 Aug, 2014 01:18 IST|Sakshi
భారత్‌కి ఏటా 1.8 లక్షల కోట్ల నష్టం!

న్యూఢిల్లీ: అమెరికాలో ప్రతిపాదిత ఇమ్మిగ్రేషన్ బిల్లు .. భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు గానీ పాసయితే.. భారత ఎకానమీకి ఏటా సుమారు రూ.1.8 లక్షల కోట్ల మేర (30 బిలియన్ డాలర్లు) నష్టం వాటిల్లనుంది. అగ్రరాజ్యంపై ఆధారపడిన ఐటీ రంగం అత్యధికంగా నష్టపోనుంది. భారత్‌కి సంబంధించిన విషయాలపై అమెరికా ప్రతినిధుల సభకు సలహాలు, సూచనలు ఇచ్చే ఇండియన్ అమెరికన్ అడ్వైజరీ కౌన్సిల్ (ఐఏఏసీ) ఈ అంశాలు వెల్లడించింది.

 కొన్ని ప్రత్యేక కేటగిరీ వీసాలపై పనిచేసే ఉద్యోగులను టార్గెట్‌గా చేసుకున్న ఇమ్మిగ్రేషన్ బిల్లు గానీ అమల్లోకి వస్తే భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)పై ఏటా 30 బిలియన్ డాలర్ల మేర ప్రతికూల ప్రభావం పడుతుందని ఐఏఏసీ చైర్మన్ శలభ్ కుమార్ చెప్పారు. దీంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. దేశీయంగా సుమారు 1 కోటి ఐటీ ప్రొఫెషనల్స్‌పైన, అమెరికాలో 5,00,000 మంది నిపుణులపైన ప్రత్యక్షంగా ప్రభావం పడుతుందని, వారికి ఉపాధి లేకుండా పోతుందని కుమార్ పేర్కొన్నారు.

నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు రానున్న నేపథ్యంలో బిల్లు ఏక్షణమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందని.. ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా అధికార, ప్రతిపక్షాలు మూడు రోజుల్లో దీనిపై పరస్పర అంగీకారానికి రావొచ్చని కుమార్ పేర్కొన్నారు.  సమయం మించిపోతున్నందున మరింత జాప్యం చేయకుండా భారత్ తన బాణీని గట్టిగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.

 ఇమ్మిగ్రేషన్ బిల్లు వివాదం ఇదీ ..
 భారత ఐటీ రంగం ఆదాయాల కోసం అత్యధికంగా అమెరికాపైనే ఆధారపడిన సంగతి తెలిసిందే. మన వారు అక్కడ ఉద్యోగం చేసేందుకు ఉపయోగపడే వీసా కేటగిరీలు కొన్ని ఉన్నాయి. ఇందులో హెచ్1బీ వీసాల ద్వారా అమెరికా కంపెనీలు విదేశీ ప్రొఫెషనల్స్‌ని నియమించుకోవచ్చు. ఇక ఏదైనా అంతర్జాతీయ కంపెనీ.. అమెరికాలోని తమ అనుబంధ సంస్థకు ఉద్యోగిని తాత్కాలికంగా బదిలీ చేసేందుకు ఎల్1 వీసాలు ఉపకరిస్తాయి. ఈ రెండు కేటగిరీల వీసాలను అత్యధికంగా పొందుతున్నది భారత కంపెనీలే.

అంతేగాకుండా చౌక సేవల కారణంగా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఎక్కువగా ఇక్కడికి తరలివస్తున్నాయి. దీంతో తమ ఉద్యోగాలను భారత్ కొల్లగొడుతోందన్న ఆరోపణలు అమెరికాలో మొదలయ్యాయి. దానికి తగ్గట్లుగానే వీసాల వినియోగంపై ఆంక్షలు విధించేలా ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని రాజకీయ పార్టీలు తెరపైకి తెచ్చాయి. బిల్లు కారణంగా భారతీయ కంపెనీలు.. అమెరికాలో ఎక్కువగా స్థానిక  ఉద్యోగులను తీసుకోవాల్సి రానుంది. దీంతో ఆయా సంస్థల వ్యయాలు పెరిగి, మార్జిన్లు దెబ్బతింటాయి.

మరిన్ని వార్తలు