నాస్‌డాక్‌ అప్‌- విప్రో ఏడీఆర్‌ జూమ్‌

30 May, 2020 09:51 IST|Sakshi

డోజోన్స్‌ డౌన్‌- ఎస్‌అండ్‌పీ ప్లస్‌

గత వారం డోజోన్స్‌ 4% గెయిన్‌

మే నెలలో నాస్‌డాక్‌ 6.7% ప్లస్‌

లాక్‌డవున్‌ ఎత్తివేతతో హుషార్‌

డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ స్పీడ్‌

కరోనా వైరస్‌కు కారణమైన చైనాను విమర్శిస్తున్న ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజా ప్రెస్‌మీట్‌లో వాయిస్‌ తగ్గించడంతో ఇన్వెస్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. వెరసి వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య అటూఇటుగా ముగిశాయి. ఇంట్రాడేలో 25,032 వద్ద కనిష్టాన్ని తాకిన డోజోన్స్‌ చివరికి 18 పాయింట్లు(0.1 శాతం) నీరసించి 25,383 వద్ద నిలిచింది. ఇక ఎస్‌అండ్‌పీ15 పాయింట్లు(0.5 శాతం) బలపడి 3,044 వద్ద స్థిరపడింది. అయితే నాస్‌డాక్‌ 121 పాయింట్లు(1.3 శాతం) జంప్‌చేసి 9,490 వద్ద ముగిసింది. కోవిడ్‌-19 కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్‌ను దశలవారీగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకోనుందన్న అంచనాలు ఇటీవల మార్కెట్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 శాతం, జేపీ మోర్గాన్‌ 2.5 శాతం చొప్పున క్షీణించడంతో శుక్రవారం డోజోన్స్‌ బలహీనపడగా.. సెమీకండక్టర్‌ తయారీ కంపెనీలు మార్వెల్‌ టెక్నాలజీస్‌ 9 శాతం, ఎన్‌విడియా 4.6 శాతం చొప్పున జంప్‌చేయడంతో నాస్‌డాక్‌ జోరందుకుంది.

డోజోన్స్‌ భళా
గత వారం డోజోన్స్‌ 3.8 శాతం లాభపడగా.. ఎస్‌అండ్‌పీ సైతం 3 శాతం ఎగసింది. నాస్‌డాక్‌ దాదాపు 2 శాతం పుంజుకుంది. ఈ నెలలో ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ 4.5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. నాస్‌డాక్‌ మరింత అధికంగా 6.7 శాతం ఎగసింది. కాగా.. ఏప్రిల్‌లో వ్యక్తిగత వ్యయాలు 13.6 శాతం క్షీణించగా.. పొదుపు రేటు 33 శాతం ఎగసినట్లు గణాంకాలు వెల్లడించాయి. 

ట్రంప్‌ ఇలా
వైట్‌హౌస్‌కు చెందిన రోజ్‌గార్డెన్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన ట్రంప్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO)తో తెగతెంపులు చేసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంస్థ పూర్తిగా చైనా నియంత్రణలో పనిచేస్తున్నదని విమర్శించారు. యూఎస్‌లో లిస్టయిన చైనా కంపెనీలు ఖాతాలను విభిన్నంగా నిర్వహించడంపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. హాంకాంగ్‌కు ఇస్తున్న ప్రత్యేక వాణిజ్య హోదాను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. అయితే చైనాతో వాణిజ్య వివాదాల జోలికి వెళ్లకపోవడం గమనార్హం. 

వేదాంతా అప్‌
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌)లో వారాంతాన అత్యధిక శాతం లాభాలతో ముగిశాయి. అయితే టాటా మోటార్స్‌(టీటీఎం) 0.7 శాతం నష్టంతో 5.71 డాలర్ల వద్ద నిలిచింది. కొత్త సీఈవో ఎంపికతో విప్రో లిమిటెడ్‌ 8.2 శాతం దూసుకెళ్లి 3.31 డాలర్లను తాకగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ 4 శాతం జంప్‌చేసి 53.44 డాలర్లకు చేరింది. ఈ బాటలో ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 2.6 శాతం ఎగసి 8.7 డాలర్ల వద్ద, వేదాంతా(వీఈడీఎల్‌) 1.9 శాతం బలపడి 4.88 డాలర్ల వద్ద ముగిశాయి. ఇతర కౌంటర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 1.8 శాతం ఎగసి 41.83 డాలర్ల వద్ద నిలవగా.. ఇన్ఫోసిస్‌ 0.4 శాతం పుంజుకుని 9.10 డాలర్ల వద్ద స్థిరపడింది.   

>
మరిన్ని వార్తలు