యూఎస్‌ మార్కెట్లకు బ్యాంకింగ్‌ షాక్‌

27 Jun, 2020 09:38 IST|Sakshi

గోల్డ్‌మన్‌ శాక్స్‌, జేపీ మోర్గాన్‌ వీక్‌

రెండో దశ కరోనా కేసుల ఎఫెక్ట్‌

డోజోన్స్‌ 730 పాయింట్లు డౌన్‌

ఆదే బాటలో ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌

ఫేస్‌బుక్‌, ట్విటర్‌, నైక్‌ ఇంక్‌ డౌన్‌

ఇండియన్‌ ఏడీఆర్‌ల వెనకడుగు

స్ట్రెస్‌ టెస్ట్‌ నేపథ్యంలో నాలుగో త్రైమాసికం ముగిసేటంతవరకూ అధిక డివిడెండ్లు, షేర్ల బైబ్యాక్‌లను చేపట్టవద్దంటూ బ్యాంకులకు తాజాగా ఫెడరల్‌ రిజర్వ్‌ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర బ్యాంకు ఆదేశాల కారణంగా వారాంతాన బ్యాంకింగ్‌ కౌంటర్లు డీలా పడ్డాయి. ప్రధానంగా గోల్డ్‌మన్‌ శాక్స్‌ 8.6 శాతం, జేపీ మోర్గాన్‌ 5.5 శాతం, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ 4.5 శాతం చొప్పున వెనకడుగు వేశాయి. దీనికితోడు తిరిగి కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు పతనమయ్యాయి. ఫ్లోరిడా, కరోలినా, ఆరిజోనా తదితర రాష్ట్రాలలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో మరోసారి లాక్‌డవున్‌ ఆవశ్యకత ఏర్పడవచ్చన్న ఆందోళనలు ఇన్వెస్టర్లలో తలెత్తాయి. ఫలితంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. డోజోన్స్‌ 730 పాయింట్లు(2.8 శాతం) పడిపోయి 25,016 వద్ద నిలవగా..ఎస్‌అండ్‌పీ 75 పాయింట్ల(2.4 శాతం) వెనకడుగుతో 3,009 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ సైతం 260 పాయింట్లు(2.6 శాతం) పతనమై 9,757 వద్ద ముగిసింది. యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ 0.7 శాతం నష్టపోగా.. ఫ్రాన్స్‌ 0.2 శాతం నీరసించింది, యూకే మాత్రం 0.2 శాతం బలపడింది. ఇక ఆసియాలో జపాన్‌, కొరియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, ఇండొనేసియా 1-0.2 శాతం మధ్య పుంజుకోగా..హాంకాంగ్‌ 1 శాతం క్షీణించింది. చైనా, తైవాన్‌ మార్కెట్లకు సెలవు.

3.3 శాతం డీలా
గత వారం డోజోన్స్‌ నికరంగా 3.3 శాతం పడిపోగా.. ఎస్‌అండ్‌పీ దాదాపు 3 శాతం తిరోగమించింది. నాస్‌డాక్‌ సైతం 2 శాతం క్షీణించింది. ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్‌, టెలికం బ్లూచిప్‌ వెరిజాన్‌.. ప్రకటనలను నిలిపివేసేందుకు నిర్ణయించడంతో సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ 8.5 శాతం పతనమైంది. హేట్‌ స్పీచ్‌ల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై ఫేస్‌బుక్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు ఈ రెండు కంపెనీలూ పేర్కొన్నాయి. ఇతర కౌంటర్లలో ట్విటర్‌తోపాటు స్పోర్ట్స్‌వేర్‌ దిగ్గజం నైక్‌, కీకార్ప్‌ కౌంటర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో 9-5.5 శాతం మధ్య ఈ కౌంటర్లు కుప్పకూలాయి. కాగా.. రిటైలింగ్‌ కంపెనీ గ్యాప్‌ ఇంక్‌ 19 శాతం దూసుకెళ్లగా.. ఐటీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్‌ 2.4 శాతం ఎగసింది.

నేలచూపుల్లో
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌)లో వారాంతాన అత్యధిక శాతం నష్టాలతో ముగిశాయి. టాటా మోటార్స్‌(టీటీఎం) 5 శాతం పతనమై 6.6 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 3.5 శాతం క్షీణించి 9.05 డాలర్ల వద్ద స్థిరపడింది, వేదాంతా(వీఈడీఎల్‌) 3.8 శాతం నష్టంతో 5.77 డాలర్లను తాకగా.. డాక్టర్‌ రెడ్డీస్‌ 2 శాతం బలహీనపడి 52.19 డాలర్లకు చేరింది. ఇతర కౌంటర్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 1.23 శాతం నీరసించి 45.09 డాలర్ల వద్ద స్థిరపడగా.. ఇన్ఫోసిస్‌ 2.6 శాతం జంప్‌చేసి 9.53 డాలర్ల వద్ద ముగిసింది. ఇక విప్రో లిమిటెడ్‌ 0.3 శాతం బలపడి 3.27 డాలర్ల వద్ద నిలిచింది.  

మరిన్ని వార్తలు