వీసా కష్టాలపై అమెరికాకు నాస్కామ్‌

3 Feb, 2017 00:10 IST|Sakshi
వీసా కష్టాలపై అమెరికాకు నాస్కామ్‌

న్యూఢిల్లీ: కఠినతర హెచ్‌1బీ వీసా నిబంధనలపై దేశీ ఐటీ రంగంలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌.. అమెరికా ప్రభుత్వ వర్గాలతో భేటీ కానుంది. ఇందుకోసం ఈ నెల 22–24 మధ్యలో ప్రత్యేక బృందం అమెరికా వెళ్లనున్నట్లు నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ వర్గాలతో, సెనేటర్లతో సమావేశం కానున్నట్లు  తెలిపారు. అమెరికాలో ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనలోను, దేశ ఎకానమీ వృద్ధిలోనూ భారత ఐటీ కంపెనీలు పోషిస్తున్న కీలక పాత్ర గురించి వారికి వివరించనున్నట్లు ఆయన చెప్పారు.

బృంద సభ్యులు, సమావేశాల వివరాలపై కసరత్తు జరుగుతోందని చంద్రశేఖర్‌ వివరించారు. స్థూల దేశీయోత్పత్తిలో భారత ఐటీ రంగం వాటా 9.3 శాతం మేర ఉంది. సుమారు 37 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. దేశీ ఐటీ సంస్థల ఎగుమతుల్లో 62 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్‌1బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడం, వీసాహోల్డర్ల కనీస వేతనాలను ఏకంగా రెట్టింపు చేసే ప్రతిపాదనలను తెరపైకి తేవడం తదితర అంశాలు భారత ఐటీ సంస్థలను కలవరపరుస్తున్నాయి.

మరిన్ని వార్తలు