పొదుపు పెంచితే.. గెలుపు తథ్యం!

29 Jan, 2018 01:38 IST|Sakshi

అదనంగా ఏటా కొంత మొత్తం కేటాయింపు

పెరిగే వేతనానికి తగ్గ స్థాయిలో ఈ పెంపు కూడా

నిర్ణీత శాతం సిప్‌ రూపంలో పెట్టుబడులకు మళ్లింపు

దీనివల్ల రాబడి తగ్గినా... అవసరమైన నిధి ఏర్పడుతుంది

ద్రవ్యోల్బణంతో ఖర్చులు పెరిగినా తట్టుకోవచ్చు  

అసలు జీవితంలో కీలకమైన లక్ష్యాలేంటి? పెళ్లికాని యువతకైతే ఉద్యోగం. పెళ్లయిన వారికైతే... పిల్లల చదువు, సొంతిల్లు, విశ్రాంత జీవనాన్ని సాఫీగా గడపటం!!. పొదుపు, మదుపు ఏం చేసినా వీటి కోసమే. కానీ ఈ పొదుపు, మదుపుల విషయంలో స్మార్ట్‌గా ఉంటేనే అనుకున్నవి సాఫీగా నెరవేరతాయి. మీ పిల్లల కాలేజీ విద్య కోసం అవసరమైన రూ.కోటి నిధిని సమకూర్చుకునేందుకు ఇప్పటి నుంచి ప్రతి నెలా రూ.50,000 చొప్పున రానున్న పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లాలని నిర్ణయించుకున్నారనుకోండి.

అప్పుడు మీ పెట్టుబడులపై వార్షిక రాబడులు కనీసం 9.5 శాతం మేర ఉండాలి. అప్పుడే రూ.కోటి నిధి సమకూరుతుంది. అయితే ఇక్కడో చిక్కుంది. వడ్డీ మనం అనుకున్నంత రాకపోవచ్చు. ఒకోసారి అనుకున్న నిధికన్నా ఎక్కువ అవసరం పడొచ్చు. మరి అలాంటపుడు ఏం చేయాలి? దానికో మంత్రముంది. అది... ప్రతి నెలా రూ.50,000 పొదుపు చేస్తూ వెళ్లడమే కాక కొంత అదనంగా పొదుపు చేయడం. ఏటా పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. దీనివల్ల మీ లక్ష్యాలను నెవవేర్చుకునే అవకాశాలు మరింత పటిష్టం అవుతాయి. ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై నిపుణుల అభిప్రాయాలను అందించేదే ఈ ప్రాఫిట్‌ కథనం.

పొదుపు పెంచుకుంటూ వెళ్లాలి...
ఇక్కడ పొదుపును పెంచడమనేది రెండు రిస్కులను తట్టుకోవడానికేనని గుర్తుంచుకోవాలి. ఆ రిస్కుల్లో మొదటిది... రాబడి మనం ఊహించినట్లుగా లేకపోవటం. రెండోది... ద్రవ్యోల్బణం పెరిగి ఖర్చు మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పెట్టాల్సి రావటం. ఇక్కడ పిల్లల చదువుకు నిధిని సమకూర్చుకోవటం కూడా ఇలాంటిదే. అందుకే ఈ నిధి కోసం ప్రత్యామ్నాయ వనరులపైనా దృష్టి సారించాలి.

తగినంత నిధి సమకూరని పక్షంలో విద్యారుణాలుండనే ఉన్నాయి. అయితే, తప్పనిసరి సందర్భాల్లోనే వాటిని వినియోగించుకోవాలి. అందుకే ఆయా ఆప్షన్లను అత్యవసరం కాని సందర్భాల్లో పక్కనబెట్టాలి. ఏటా పొదుపు మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లడానికి... వేతనం వార్షికంగా కొంత పెరుగుతుంది కనక ఆ భాగాన్ని ఉపయోగించుకోవాలి.

ఏదైనా రుణం ఉంటే ఇతర లక్ష్యాలకు చేసే పొదుపు పరిమితమవుతుంది. రుణాలేవీ లేకుంటే మాత్రం పన్ను అనంతరం నెలవారీ ఆదాయంలో 30–40 శాతం వరకూ పొదుపు చేసే అవకాశముంటుంది. ఉదాహరణకు నెలకు రూ.1.5 లక్షల ఆదాయం వస్తుందనుకుంటే ప్రారంభంలో కనీసం 30 శాతం పొదుపు చేయగలరనుకోవాలి. అంటే రూ.45,000. మరుసటేడాది వేతనంలో పెంపు 10 శాతం ఉంటే నెలసరి వేతనం రూ.1.65 లక్షలవుతుంది. దాంతో నెలనెలా చేసే రూ.45,000 పొదుపునకు అదనంగా పెరిగిన రూ.15 వేల నుంచి 30 శాతాన్ని మళ్లించాలి.

ఇలా ఏటా పెరిగే వేతనంలో ఈ స్థాయిలో మళ్లించుకుంటూ వెళితే నిర్ణీత కాలానికి భారీగా నిధి సమకూరుతుంది. అంతేకాదు, ఇలా చేయడం వల్ల మీ పోర్ట్‌ ఫోలియో రాబడుల పరంగా డౌన్‌సైడ్‌ రిస్క్‌ తగ్గుతుంది కూడా. ఎలాగంటే..? ఉదాహరణకు ఈక్విటీలకు 65 శాతం , బాండ్లకు 35% పొదుపు నిధుల్ని కేటాయించారనుకోండి. దీనిపై కనీస రాబడులు 9.5 శాతంగా ఉండాలన్నది మీ లక్ష్యం. ఒకవేళ రాబడులు తగ్గినప్పటికీ ఏటా పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లడం వల్ల లక్ష్యాలను విజయవంతంగా అధిగమించొచ్చు.

ఫార్వర్డ్‌ సిప్‌ ఎంతో బెటర్‌...
ఏటా ఏప్రిల్‌లో వేతన సవరణ ఉందనుకోండి. మే 5వ తేదీన వేతనం వస్తుందనుకుంటే, అందుకు ఒక నెల ముందే సిప్‌ ప్రణాళికను ఆరంభించాలి. ఏటా పెంచుకుంటూ వెళ్లే మొత్తాన్ని అప్పటి వరకు ఎంపిక చేసుకున్న సాధనాల్లోకే (మ్యూచువల్‌ ఫండ్స్, రికరింగ్‌ బ్యాంకు డిపాజిట్లు) వెళ్లాలి. ఇలా లక్ష్య సాధనకు గడువు దగ్గర పడే వరకూ ఈ వ్యూహాన్నే అనుసరించడం మంచిది. ఉదాహరణకు ఈక్విటీకి 75 శాతం, బాండ్లకు 35 శాతం కేటాయిస్తుంటే, ఏటా పెంచే పెట్టుబడుల మొత్తాన్ని ఈ రెండు సాధనాల్లోకి ఇదే నిష్పత్తిలో కేటాయించాలి. ఒకవేళ వేతన సవరణ జరగకపోయిన పక్షంలో... అవసరమనుకుంటే సిప్‌ను రద్దు చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు