రూ.కోటి కవరేజీ చాలా..?

27 Aug, 2018 00:54 IST|Sakshi

నేడు ఇది పెద్దగానే కనిపించొచ్చు

కొన్నేళ్ల తర్వాత ఇది పెద్ద మొత్తం కాబోదు

ద్రవ్యోల్బణం ప్రభావం ఉండనే ఉంటుంది

పిల్లల విద్య, వివాహం వృద్ధాప్య సమస్యలు..

అన్నీ లెక్కలేసి బీమా తీసుకుంటేనే ప్రయోజనం  

కోటి రూపాయలకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకున్న ఓ బ్రహ్మచారి ఆ తర్వాత కాలంలో వివాహం చేసుకున్నాడనుకోండి. ఆ మొత్తం అతడి కుటుంబ అవసరాలు, జీవిత లక్ష్యాల కోసం సరిపోకపోవచ్చు. చాలామంది తమకు ప్రాణ ప్రమాదం వాటిల్లితే రూ.కోటి మొత్తం సరిపోతుందని అనుకుంటుంటారు. రూ.కోటి ఈ రోజు పెద్ద మొత్తంగానే కనిపించొచ్చు. ‘‘చాలా మంది తమకు సౌకర్యవంతమైన మొత్తానికి కవరేజీ తీసుకుంటుంటారు. అలా చూస్తే రూ.కోటి ఎక్కువగా ప్రచారంలో ఉన్న నంబర్‌. కానీ సరిపోతుందా? తమ అవసరాలకు సంబంధించి ఏ విధమైన లెక్కలు వేసుకోకుండా రూ.కోటి మొత్తానికి పాలసీ తీసుకుంటారు’’ అని కవర్‌ఫాక్స్‌ డైరెక్టర్‌ మహావీర్‌ చోప్రా పేర్కొన్నారు. ఇలా తోచిన మొత్తం కాకుండా అసలు ఎంత మేరకు బీమా తీసుకోవాలన్నది నిపుణుల సూచన...


రూ.కోటిని తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్‌ చేస్తే... 7 శాతం వడ్డీ రేటుపై ప్రతీ నెలా రూ.58,333 ఆదాయం లభిస్తుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబం నేటి జీవన అవసరాలకు ఇది సరిపోతుంది. కానీ, అప్పటికే ఏవైనా రుణాలు తీసుకుని ఉంటే వాటిని తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. వీటిని పరిగణనలోకి తీసుకుని, ద్రవ్యోల్బణ ప్రభావం, ఆదాయపన్ను ప్రభావాలను కూడా చూస్తే రూ.కోటి పెద్ద మొత్తం కాదన్నది నిపుణుల అభిప్రాయం.

పిల్లల విద్య, వివాహం, జీవిత భాగస్వామి పదవీ విరమణ అనంతర జీవిత అవసరాలకు ఏక మొత్తంలో నిధిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఇంటి రుణం తీసుకుని, ఇద్దరు పిల్లలు కూడా కలిగి ఉంటే, అకాల మరణంతో వచ్చే రూ.కోటి పరిహారం అతని కుటుంబ అవసరాలను 12–13 ఏళ్లకు మించి తీర్చలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చాలా మంది ఇప్పటికీ సరిపడా బీమా కవరేజీ లేనివారే. 2014లో స్విస్‌ ఆర్‌ఈ నిర్వహించిన సర్వే ప్రకారం మన దేశంలో 92 శాతం మందికి జీవిత బీమా రక్షణ కొరత ఉంది. రూ.కోటి బీమా అవసరమైన చోట సగటున రూ.8 లక్షల బీమా కవరేజీయే ఉంది. బీమా రక్షణపై తగినంత అవగాహన లేకపోవడం, పెట్టుబడి ఆధారిత బీమా పథకాలకు పరిమితం కావడం ఇందుకు కారణంగా తెలిసింది.

అన్నీ చూడాలి...
వార్షిక ఆదాయానికి తక్కువలో తక్కువ కనీసం 10 రెట్ల మొత్తం అయినా బీమా ఉండాలన్నది సాధారణ సూత్రం. కానీ, ఇది అందరికీ సరిపోయే పరిపూర్ణ సూత్రం కాదు. ఇది ఓ వ్యక్తి రుణ బాధ్యతలను, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని చెప్పే సంఖ్య కాదు. వాస్తవంగా చూస్తే ప్రతీ వ్యక్తి ఆర్థిక పరిస్థితి, అవసరాలు భిన్నంగా ఉంటాయి. అందరికీ ఒకటే మూల సూత్రం పనికిరాదు. అందరూ ఇదే సూత్రాన్ని పాటిస్తే వారి ఆశించిన లక్ష్యం నెరవేరకపోవచ్చు. తనకు ప్రాణ ప్రమాదం వాటిల్లితే తనపై ఆధారపడి ఉన్న వారికి ప్రతీ నెలా ఎంత మొత్తం కావాలి? అలా ఎన్నేళ్ల పాటు అవసరం అన్న స్పష్టత ఉండాలి.

‘‘రూ.50 లక్షల గృహ రుణం తీసుకుని ఉంటే, దాన్ని రూ.కోటి బీమా పరిహారం మొత్తం నుంచి మినహాయించి చూడాలి. మిగిలిన రూ.50 లక్షలను ఎంత తెలివిగా ఇన్వెస్ట్‌ చేసినా గానీ దీర్ఘకాలం పాటు ఆ వ్యక్తి కుటుంబ అవసరాలకు సరిపోదు’’ అని ఆప్టిమా మనీ మేనేజర్స్‌ సీఈవో పంకజ్‌ మంత్‌పాల్‌ తెలిపారు. గృహ రుణం ఇచ్చిన బ్యాంకులు అది తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భాల్లో, అతని కుటుంబ సభ్యులు తిరిగి బకాయిలు చెల్లించేందుకు అదనపు కాలాన్ని ఇచ్చేందుకూ అంగీకరించే పరిస్థితి లేదు. కనుక బీమా మొత్తాన్ని నిర్ణయించే ముందు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.

జీవిత భాగస్వామికి చివరి వరకూ...
జీవిత భాగస్వామి జీవించి ఉండేంత వరకు అవసరాలను తీర్చే విధంగానూ బీమా మొత్తం ఉండాలి. ముఖ్యంగా అతను లేదా ఆమె ఎటువంటి ఆర్జనా పరులు కాకపోయి ఉంటే, వృద్ధాప్యంలో వారు ఎటువంటి ఇబ్బంది పడకుండా, హాయిగా జీవించేలా, ఆ అవసరాలను బీమా పరిహారం తీర్చే విధంగా ఉండాలి. వైద్య చికిత్సలు, జీవిత అవసరాలకు అయ్యే ఖర్చులను పరిగణనలోకి తీసుకోవాలని కెనరా హెచ్‌ఎస్‌బీసీ ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రొడక్ట్స్‌ హెడ్‌ రిషి మాథుర్‌ సూచించారు. ప్రతీ వ్యక్తి, అతని కుటుంబ అవసరాలు భిన్నంగా ఉంటాయన్నారు.  

జీవిత విలువ మదింపు
బీమా కవరేజీ నిర్ణయించుకునే ముందు వ్యక్తి ‘జీవిత విలువ’ను కూడా అంచనా వేసుకోవాలంటారు నిపుణులు. అంటే ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి తన మిగిలిన జీవితంలో ఎంత మేర సంపాదించుకోగలరన్నది. ఈ మొత్తం నుంచి సగటు ద్రవ్యోల్బణ అంచనాను తీసివేయాలి. అంటే, నేటి అవసరాలను భవిష్యత్తులోనూ కొనుగోలు చేసే సామర్థ్యం ఉండేలా చూడాలి. ఈ జీవిత విలువ నుంచి బీమా తీసుకునే వ్యక్తి వ్యక్తిగత ఖర్చులను తీసేయాలి. దీంతో తన కుటుంబానికి ఎంత మేర అవసరం అవుతుందన్నది లెక్క వస్తుంది.  

ద్రవ్యోల్బణం అంచనా
భవిష్యత్తు ఖర్చులను అంచనా వేసే సమయంలో కచ్చితంగా ద్రవ్యోల్బణాన్ని మర్చిపోకూడదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే కుటుంబ అవసరాలు కూడా పెరుగుతుంటాయి. 2018లో నెలకు రూ.50,000 అవసరం ఉంటే, 7 శాతం ద్రవ్యోల్బణం అంచనా మేరకు చూస్తే... ఐదేళ్ల తర్వాత అదే కుటుంబం అవసరాలకు రూ.70,000 కావాల్సి ఉంటుంది. ఇక పదేళ్ల తర్వాత 2028లో ఇదే ద్రవ్యోల్బణం అంచనా ప్రకారం చూస్తే ప్రతీ నెలా అవసరాల కోసం రూ.లక్ష అవసరం అవుతుంది. బీమా రక్షణ అన్నది ఈ మేరకు అవసరాలను తీర్చేదై ఉండాలి.

అందుకే నిపుణులు బీమా పాలసీ తీసుకోవడంతోపాటు ప్రతీ ఐదేళ్లకొకసారి అది ఏ మేరకు సరిపోతుందన్నది సమీక్షించుకోవాలని సూచిస్తుంటారు. ముఖ్యంగా వివాహమై పిల్లలు కలిగితే వ్యయాలు పెరిగిపోతాయి. కొన్ని పాలసీల్లో ప్రతీ ఐదేళ్ల కొకసారి బీమా కవరేజీ మొత్తం పెరిగే ఆప్షన్‌ కూడా ఉంది. దీన్నే లైఫ్‌ స్టేజ్‌ ఎన్‌హాన్స్‌మెంట్‌ అంటారు. ఇటువంటి పాలసీ తీసుకుంటే బీమా కవరేజీని ప్రత్యేకంగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడదు. ఇలా పాలసీలోనే ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌ ఉంటే ఎంతో సౌకర్యం. ఎందుకంటే మధ్యలో స్వయంగా పెంచుకోవాలంటే వైద్య పరీక్షలు అవసరం అవుతాయి. అలా అని అందరికీ పెద్ద మొత్తంలో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ అవసరం పడకపోవచ్చు. ‘‘తమపై ఆధారపడిన వారి ఆర్థిక అవసరాలకు రక్షణనిచ్చేదిగా ఉంటే చాలు. ఒకవేళ తమపై ఆధారపడిన వారు ఎవరూ లేకపోతే, టర్మ్‌ ప్లాన్‌కు దూరంగాను ఉండొచ్చు’’ అని ఫైనాన్షియల్‌ ప్లానర్‌ ప్రేరణ సలాస్కర్‌ సూచించారు.  

>
మరిన్ని వార్తలు