తాగారో...మీ బండి కదలదంతే..!

21 Apr, 2018 18:27 IST|Sakshi

ఉత్తరాఖండ్‌ : మన దేశంలో గంటకి సగటున​ 16 యాక్సిడెంట్లు జరుగుతున్నాయని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ తెలుపుతోంది. వీటి నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. సరైన ఫలితం మాత్రం ఉండటం లేదు. ఈ ప్రమాదాలు జరగడానికి ముఖ్య కారణాలు తాగి వాహనాలు నడపడం, ఫోన్‌ మాట్లాడుతూ వాహనాలు నడపడం, నిద్ర మత్తులో వాహనాలు నడపడం. దీంతో యాక్సిడెంట్ల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇక మీద ఇలాంటి ప్రమాదాల నివారణకు ఉత్తరాఖండ్‌కు చెందిన విద్యార్థులు ఒక నూతన పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరాన్ని వాహనాలలో అమర్చిన తరువాత తాగి వాహనాన్ని నడపాలని ప్రయత్నిస్తే అవి మోరాయించేలా చేస్తుంది ఈ పరికరం.

అల్మోరాలోని ఉత్తరాఖండ్‌ రెసిడెన్షియల్‌ విశ్వవిద్యాలయం, హల్ద్వానికి చెందిన ఆర్‌ఐ ఇనుస్ట్రుమెంట్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సంయుక్తంగా ఈ పరికరాన్ని రూపొందించారు. ఆర్‌ పీ జోషి, ఆకాష్‌ పాండే, కుల్దీప్‌ పటేల్‌ కలిసి జట్టుగా ఏర్పడి వ్యర్థాలు, అడవి గడ్డి వంటి పదార్థాలను ఉపయోగించి గ్రాఫీన్‌ను తయారు చేశారు. ప్రమాదాల నివారణకు ఈ గ్రాఫీన్‌ పూత పూసిన ఎలక్ట్రోడ్‌లను వాహనాలలో అమర్చుతారు. ఈ ఎలక్ట్రోడ్‌లు ముఖ్యంగా మద్యంలో ఉన్న ఈథైల్‌ ఆల్కహాల్‌ను ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఎసిటిక్‌ ఆమ్లంగా మారుస్తుంది.

పనిచేయు విధానం...
ఈ సెన్సార్‌ను వాహనంలో డ్రైవర్‌ ముందు భాగంలో బిగిస్తారు. డ్రైవర్‌ వాహనాన్ని స్టార్ట్‌ చేయాలనుకుంటే ముందు గ్రాఫీన్‌ సెన్సార్‌ మీద ఊదాలి. ఇలా ఊదగానే సెన్సార్‌ ఆక్టివేట్‌ అయ్యి రక్తంలో ఆల్కహాల్‌ ఎంత ఉందనే విషయాన్ని విశ్లేషిస్తుంది. ఒకవేళ ఆల్కహాల్‌ లిమిట్‌ మోటర్‌ వాహనాల చట్టం ప్రకారం నిర్దేశించిన దాని కంటే ఎక్కువగా ఉంటే సెన్సార్‌లో ఎరుపు రంగు గుర్తు వస్తుంది. వాహనం స్టార్ట్‌ కాదు. ఒకవేళ గ్రాఫీన్‌ సెన్సార్‌పై ఊదకుండా వాహనాన్ని స్టార్ట్‌ చేద్దామన్న కూడా కదలదు. తప్పనిసరిగా గ్రాఫీన్‌ సెన్సార్‌పై ఊదిన తర్వాతే వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. సెన్సార్‌లోని ఇమాజింగ్‌ మాడ్యుల్‌, డ్రైవర్‌ కంటి కదలికలను విశ్లేషించి, అతను నిద్రపోతున్నట్టు అనిపిస్తే  పక్కనే ఉన్న ప్రయాణికులను అలర్ట్‌ చేస్తుంది. అంతేకాక ఈ ఇమాజింగ్‌ మాడ్యుల్‌ డ్రైవర్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నట్లయితే, అతని చుట్టుపక్కల వారికి అలర్ట్‌ ఇస్తుంది.

మరిన్ని ప్రత్యేకతలు...
ఇవేకాక ఈ పరికరంలో జీపీఆర్‌ఎస్‌ - జీఎస్‌ఎం, బయోమెట్రిక్‌ వంటి అధునాతన సాంకేతికతలను కూడా రూపొందించారు. ఒకవేళ యాక్సిడెంట్‌ జరిగినట్లయితే 5 - 10 నిమిషాల్లో దానంతట అదే 100కు ఫోన్‌ చేసి ఎస్‌ఓఎస్‌ను కూడా పంపిస్తుంది.

విద్యార్థులు చేసిన ఈ వినూత్న ప్రయత్నానికి ఉత్తరాఖండ్‌ గవర్నర్‌ కే. కే. పౌల్‌ అభినందనలు తెలిపారు. వెంటనే దీనికి పేటెంట్‌కు దరఖాస్తు చేసుకోమని సూచించారు. అంతేకాకుండా వాణిజ్య వాహనాలలో కూడా వాడుకునే విధంగా ఈ పరికరంలో మార్పులు చేయాల్సిందిగా కోరారు. ఈ పరికరాన్ని వాహనాలలో వాడడాని కంటే ముందు మనేసర్‌లోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ, గురుగ్రాంలోని ఎస్.జీ.ఎస్ ల్యాబ్, పూణేలోని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వద్ద పరీక్షిస్తారు. ఆ తరువాతనే దీన్ని వాహనాలలో అమర్చడానికి అనుమతి ఇవ్వనున్నారు.

మరిన్ని వార్తలు