హైదరాబాద్‌ వద్ద వల్లభ డెయిరీ ప్లాంటు

27 Jun, 2019 10:41 IST|Sakshi

రూ.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు

జనవరికల్లా రాజమండ్రిలో కేంద్రం

ఈ ఏడాది రూ. 500 కోట్ల టర్నోవర్‌ లక్ష్యం

‘సాక్షి’తో సంస్థ చైర్మన్‌ బొల్లా బ్రహ్మనాయుడు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పాలు, పాల పదార్థాల రంగంలో ఉన్న వల్లభ డెయిరీ హైదరాబాద్‌ సమీపంలో అత్యాధునిక ప్లాంటును నెలకొల్పింది. యాదాద్రి–భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్లాంటును బుధవారం ఆరంభించింది. రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెసింగ్‌ చేయగల సామర్థ్యం ఈ కేంద్రానికుంది. మల్కాపూర్‌ ప్లాంటుకు రూ. 50 కోట్లు వెచ్చించినట్లు వల్లభ డెయిరీ చైర్మన్, వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఇక్కడి ప్లాంటు నుంచి పాలను సరఫరా చేస్తామని తెలిపారు. 

ఏపీలో మరో కేంద్రం..
కంపెనీ ఏపీలోని రాజమండ్రి దగ్గరున్న ఎర్నగూడెం వద్ద కొత్తగా తయారీ కేంద్రాన్ని నిర్మిస్తోంది. రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేయగల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంటుకు రూ.50 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. 2020 జనవరి కల్లా ఇక్కడ ఉత్పత్తి ప్రారంభం అవుతుందని కంపెనీ చెబుతోంది. అలాగే 2020 చివరి నాటికి వల్లభ డెయిరీ మహారాష్ట్రలో ఎంట్రీ ఇవ్వనుంది. అక్కడ కూడా రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్‌ చేయగలిగే ప్లాంటును రూ.50 కోట్లతో ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వినుకొండ, చిత్తూరు జిల్లా కాణిపాకంలో ప్లాంట్లున్నాయి. ఒక్కో కేంద్రం సామర్థ్యం రోజుకు 2 లక్షల లీటర్లు. ఈ రెండు యూనిట్ల కోసం సంస్థ రూ.100 కోట్లు ఖర్చు చేసింది.

ఈ ఏడాది రూ.500 కోట్లు..: వల్లభ డెయిరీ పాలతోపాటు నెయ్యి, పెరుగు, మజ్జిగ, పాలతో తయారైన స్వీట్లు, పానీయాలను విక్రయిస్తోంది. కంపెనీ ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మార్కెట్లలో విస్తరించింది. అటు దక్షిణాదిన చెన్నై, బెంగళూరు నగరాల్లోనూ అడుగు పెట్టింది. ఈ ఏడాది తమిళనాడు, కర్ణాటకలోని ప్రధాన నగరాలు, పట్టణాలను పూర్తిగా కవర్‌ చేయాలని లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో 50 చిల్లింగ్‌ సెంటర్లను వల్లభ డెయిరీ నిర్వహిస్తోంది. త్వరలో మరో 25 చిల్లింగ్‌ కేంద్రాలు తోడవనున్నాయి. 2018–19లో కంపెనీ రూ.250 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ రూ.500 కోట్లు సాధించాలని లకి‡్ష్యంచుకున్నట్లు బ్రహ్మనాయుడు వెల్లడించారు.

మరిన్ని వార్తలు