26 నుంచి వారోక్‌ ఐపీఓ

20 Jun, 2018 00:51 IST|Sakshi

రూ.1,950 కోట్లు సమీకరణ

ప్రైస్‌బ్యాండ్‌ రూ.965–967   

ముంబై: వాహన విడిభాగాలు తయారు చేసే వారోక్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ఈ నెల 26న ప్రారంభమవుతోంది. 28న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ ను రూ.965– 967గా (షేర్‌ ముఖ విలువ రూ.1) కంపెనీ నిర్ణయించింది. ఐపీఓ ద్వారా కంపెనీ రూ.1,955 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓలో భాగంగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో మొత్తం 2.02 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత ఇన్వెస్టర్లు విక్రయిస్తారు.

ప్రమోటర్‌ తరంగ్‌ జైన్‌ 17.52 లక్షల షేర్లను, ఇన్వెస్టర్‌ ఓమెగా టీసీ హోల్డింగ్స్‌ 1.69 కోట్ల షేర్లను, టాటా క్యాపిటల్‌ సంస్థ 15.52 లక్షల షేర్లను విక్రయిస్తాయి. కనీసం 15 షేర్లకు దరఖాస్తు చేయాలి. ఈ షేర్లు వచ్చే నెల 6న స్టాక్‌ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్, సిటిగ్రూప్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ ఇండియా, క్రెడిట్‌  సూసీ సెక్యూరిటీస్‌ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌ వ్యవహరిస్తున్నాయి. ఔరంగాబాద్‌లో 1990లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఎక్స్‌టీరియర్‌ లైటింగ్‌ సిస్టమ్స్, పవర్‌– ట్రైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, బాడీ, ఛాసిస్‌ విడిభాగాలను ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీలకు సరఫరా చేస్తోంది. 

మరిన్ని వార్తలు