వరుణ్‌ చేతికి హోటల్‌ గేట్‌వే!

5 Oct, 2018 01:42 IST|Sakshi

రూ.121.10 కోట్లకు కొనుగోలు

దీంతో అందుబాటులోకి  600 గదులు...

త్వరలో విజయవాడలో  నొవోటెల్‌ ప్రారంభం

విశాఖపట్నం: విశాఖ సముద్ర తీరంలోని లగ్జరీ హోటల్‌ ‘తాజ్‌ గేట్‌వే’ను వరుణ్‌ గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఈ హోటల్‌ను దాదాపు రూ.121.10 కోట్లకు కొనుగోలు చేసినట్లు వరుణ్‌ గ్రూప్‌ చైర్మన్‌ ప్రభుకిషోర్‌ తెలియజేశారు. ఆయన గురువారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. ఆటోమొబైల్స్, వినోదం, ఆతిథ్యం సహా పలు రంగాల్లో ఉన్న వరుణ్‌ గ్రూప్‌నకు ప్రస్తుతం రెండు హోటల్‌ ప్రాపర్టీలున్నాయి. విశాఖ బీచ్‌రోడ్, భీమిలిలో ఉన్న ఈ రెండు హోటళ్లను నొవోటెల్‌ బ్రాండ్లతో ‘అకార్డ్‌’ గ్రూపు నిర్వహిస్తోంది. తాజాగా గేట్‌వే కూడా తమ ఖాతాలో చేరటంతో తమ హోటళ్లలోని మొత్తం గదుల సంఖ్య 600కు చేరిందని ప్రభుకిషోర్‌ తెలియజేశారు.

తాజ్‌ బ్రాండ్‌తో టాటా గ్రూపు నిర్వహిస్తున్న హోటల్‌ గేట్‌వేలో ఇప్పటివరకు టాటాలకు  40, రెడ్డీస్‌కు 30 శాతం వాటాలుండగా మిగతాది పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌. ‘‘గేట్‌వే కొనుగోలు గతనెల 29న ఖరారయింది. దీనికోసం చెన్నై, విశాఖ  నుంచి రెండు సంస్థలు పోటీపడినా... మా సామర్థ్యాన్ని, వేగవంతమైన విస్తరణను చూసి మాకే విక్రయించటం సంతోషకరం. వచ్చే నాలుగేళ్లలో ఆతిథ్య రంగంలో మొత్తం 1000 రూమ్స్‌ మా చేతిలో ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని ఆయన వివరించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వద్ద 196 గదుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న నొవోటెల్‌ను ఈ డిసెంబరులో ప్రారంభించనున్నట్లు కూడా చెప్పారాయన. ఈ సమావేశంలో వరుణ్‌ గ్రూప్‌ డెరైక్టర్లు వరుణ్, వర్ష పాల్గొన్నారు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు