ఆంధ్రప్రదేశ్‌లో ‘వీర’ బస్‌ యూనిట్‌

2 Nov, 2017 00:03 IST|Sakshi

తొలి దశలో 350 కోట్ల పెట్టుబడి

ఏటా 8,000 బస్సుల తయారీ

సాక్షితో కంపెనీ ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బస్‌ బాడీ బిల్డింగ్‌ కంపెనీ వీర వాహన ఉద్యోగ్‌ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుడిపల్లి వద్ద 120 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతోంది. ఏపీఐఐసీ నుంచి కంపెనీ ఈ స్థలాన్ని కొనుగోలు చేసింది. చెల్లింపులు పూర్తయ్యాయని, అధికారికంగా స్థలం చేతిలోకి రాగానే నిర్మాణం ప్రారంభిస్తామని వీర వాహన ఉద్యోగ్‌ ఎండీ కె.శ్రీనివాస్‌ రెడ్డి ‘సాక్షి’ బిజినెస్‌ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. 18 నెలల్లో వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెడతామన్నారు. కంపెనీకి ఇప్పటికే బెంగళూరులో యూనిట్‌ ఉంది. వీర బ్రాండ్‌తో స్లీపర్, లగ్జరీ కోచ్‌లు, స్కూల్, సిటీ బస్‌లను రూపొందిస్తోంది.

రెండు దశల్లో పెట్టుబడి..: అనంతపురం ప్లాంటుకు తొలి దశలో రూ.350 కోట్లు పెట్టుబడి పెడతారు. ఏటా 8,000 పెద్ద బస్‌లను రూపొందించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఇంజన్, గేర్‌బాక్స్, యాక్సిల్‌ను ఇతర కంపెనీల నుంచి కొనుగోలు చేసి, చాసిస్‌తోసహా మిగిలిన భాగాలన్నీ ప్లాంటులోనే తయారు చేస్తారు. రెండో దశలో రూ.300 కోట్ల దాకా పెట్టుబడికి అవకాశం ఉన్నట్లు శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ‘రెండో దశలో ఏటా 15–18 వేల చిన్న బస్‌ల తయారీకి ప్రణాళిక చేస్తున్నాం. ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 4వేల మందికి ఉపాధి లభిస్తుంది. 25 వరకూ అనుబంధ పరిశ్రమలు వస్తాయి’’ అని వివరించారు.
ఎలక్ట్రిక్‌ బస్‌లు సైతం..: కంపెనీ ఎలక్ట్రిక్‌ బస్‌ల విభాగంలోకీ ప్రవేశిస్తోంది. ప్రోటోటైప్‌ తయారీలో ప్రస్తుతం నిమగ్నమైంది. ఆరు నెలల్లో ప్రోటోటైప్‌ సిద్ధం కానుంది.  అనుమతులు రాగానే ఎలక్ట్రిక్‌ బస్‌ల తయారీ ప్రారంభిస్తారు. దేశంలో పలు రోడ్డు రవాణా సంస్థలు ఇపుడిపుడే ఈ బస్‌లను ప్రోత్సహిస్తున్నాయి. టార్మాక్‌ కోచ్‌ల తయారీలోకి కంపెనీ ఇప్పటికే అడుగుపెట్టింది కూడా. ఎయిర్‌పోర్టుల్లో ఈ కోచ్‌లే పరుగెడుతున్నాయి. ఇక బెంగళూరు ప్లాంటు వార్షిక సామర్థ్యం 1,000 యూనిట్లు. ఇక్కడ 800 మంది పనిచేస్తున్నారు. వీర వాహన ఉద్యోగ్‌ ఇప్పటి వరకు ఈ యూనిట్‌కు రూ.30 కోట్లు ఖర్చు చేసింది. 10,000లకుపైగా బస్‌లను ప్రభుత్వ, ప్రైవేటు ఆపరేటర్లకు సరఫరా చేసింది.

మరిన్ని వార్తలు