వరదల సమయంలో వాహనానికి రక్షణ..

23 Sep, 2019 00:19 IST|Sakshi

మన దేశంలోని చాలా పట్టణాల్లో గట్టిగా వర్షం పడితే వరద పారే పరిస్థితి కనిపిస్తుంది. ఆయా సందర్భాల్లో వాహన నష్టాలను ఎదుర్కోవడం కీలకం.

ఈ ఏడాది ముంబై నగరంలో 48 గంటల్లోనే 540 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వందలాది ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. రోడ్డు పక్కన, ఫ్లైవోవర్ల కింద కార్లు నిలిచిపోయాయి. యజమానులు వాటిని విడిచిపెట్టేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాహనాన్ని, మరీ ముఖ్యంగా కారును వరద నీటిలో నడపడం పూర్తిగా సురక్షితం కాదు. ఎప్పుడు నీటి పరిమాణం పెరిగిపోతుందో, సెంట్రల్‌ డోర్‌ లాక్‌ సిస్టమ్‌ జామ్‌ అయిపోతుందో తెలియని పరిస్థితి.

దీంతో మీరు, మీతోపాటు కారులో ఉన్న వారు లోపల చిక్కుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ముంబై, ఇతర ప్రాంతాల్లో వర్షపు నీరు కారణంగా వాహనాలకు నష్టం వాటిల్లడంతో, మోటారు బీమా క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది మోటారు ఇంజన్లు దెబ్బతిన్నట్టు, అందుకు సంబంధించి కొన్ని అధిక క్లెయిమ్‌లు వచ్చాయి. అయితే, మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీలో ఇంజిన్‌కు వాటిల్లే నష్టానికి రక్షణ ఉండదు. కనుక వరద నీటిలోనూ మీకు, మీ కారుకు రక్షణ ఉండేలా అదనపు కవరేజీ తీసుకోవాలి. మనుషులకు, వాహనాలకు సమస్యలను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలు ఇవి...

► వరదల సమయంలో కారులో ఉండిపోవడం సురక్షితం కాదు. వర్షపు నీటిలో కారును నడుపుతుంటే, విండో అద్దాలను కిందకు దించేసి, డోర్లను అన్‌లాక్‌ చేసి ఉంచాలి. దీంతో బయట వర్షపునీటి స్థాయి పెరుగుతుంటే ఆ విషయం తెలుస్తుంది. నీటి పరిమాణం పెరిగిపోతుంటే కారు నుంచి దిగిపోయి ఎత్తయిన ప్రదేశానికి చేరుకోవాలి. ఎందుకంటే మనిషి ప్రాణమే విలువైనది.

► బురద నీటిలో కారు ఎంత మేర మునిగిపోయిందో చూడాలి. కారు డోర్ల స్థాయి నుంచి నీరు పెరగకపోతే అప్పుడు కారుకు పెద్దగా నష్టం వాటిల్లనట్టే. డ్యాష్‌బోర్డు స్థాయికి వర్షపునీరు చేరుతుంటే వెంటనే బీమా సంస్థకు లేదా సర్వీసింగ్‌ యూనిట్‌కు కాల్‌ చేసి వారు చెప్పినట్టు చేయాలి.   

► ఫ్యూయల్‌ వ్యవస్థను పరిశీలించాలి. పాత కార్లు అయితే వాటి నుంచి ఇంధనం తొలగించడం అవసరం. బ్రేక్, క్లచ్, పవర్‌ స్టీరింగ్, కూలంట్లు మార్చాల్సి వస్తుంది.  

► వరద నీటిలో కారు కొంత సమయం పాటు నిలిచిపోయిన తర్వాత ఇంజిన్‌ను ఆన్‌ చేయవచ్చు. ముఖ్యంగా కారు పూర్తిగా మునిగిపోయిన సమయంలో ఈ పని చేయకూడదు. ఆన్‌ చేస్తే ఇంజిన్‌లోని భాగాల్లోకి నీరు చేరిపోయే అవకాశం ఉంటుంది. దీంతో ఇంజిన్‌లోని భాగాలు దెబ్బతింటాయి. దెబ్బతిన్న ఇంజిన్‌ను బాగు చేసేందుకు  మోడల్‌ను బట్టి ఖర్చు మారుతుంది.  

► వీలైతే కొన్ని రోజుల వరకు కారును స్టార్ట్‌ చేయకుండా వేచి చూడడం మంచిది. ఎందుకంటే కారులోని ఎయిర్‌డక్టుల్లో నీటి ఆవిరి మిగిలి ఉంటే  ఆన్‌ చేయడం వల్ల ఇంజన్‌ దెబ్బతింటుంది.  

► షార్ట్‌ సర్క్యూట్‌ అవకుండా బ్యాటరీని తొలగించాలి. బ్యాటరీని తిరిగి కనెక్ట్‌ చేస్తున్నట్టు అయితే, ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఎలక్ట్రికల్‌ సిస్టమ్స్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయాలి. హార్న్, హెడ్‌లైట్లు, ఇండికేటర్లు, ఎయిర్‌ కండిషనింగ్, స్టీరియో, పవర్‌లాక్‌లు, ఇంటీరియర్‌ లైట్లను తనిఖీ చేయాలి. ఎక్కడైనా ఫ్లిక్కరింగ్‌ను గుర్తించినట్టయితే మెకానిక్‌కు కాల్‌ చేయాలి.

► మీ కారును సమీపంలోని గ్యారేజ్‌ లేదా సర్వీస్‌ సెంటర్‌కు తీసుకెళ్లి పూర్తి తనిఖీ చేయించేందుకు గాను టౌసర్వీస్‌కు కాల్‌ చేయాలి. టౌవ్యాను వచ్చే లోపు కారులోపల తడి ఉంటే, వస్త్రంతో తొలగించేందుకు ప్రయత్నించాలి. ఉప్పు నీటిలో కారు మునిగిపోయి ఉంటే నష్టం ఎక్కువయ్యేందుకు అవకాశం ఉంటుంది.  

► సమగ్ర మోటారు వాహన ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవాలి. తగిన యాడాన్‌ కవరేజీ తీసుకోవాలి. దాంతో ఆర్థిక భారం తగ్గిపోతుంది.  కారుకు నష్టం వాటిల్లిన సందర్భాల్లో అధిక శాతం బీమా కంపెనీయే చెల్లిస్తుంది. కనుక మీ జేబుపై భారం తగ్గుతుంది. పాలసీ తీసుకునే ముందు పత్రాలను క్షుణంగా చదవడం ద్వారా మంచి డీల్‌ అవునో, కాదో తెలుస్తుంది.

మోటారు ఇన్సూరెన్స్‌ పాలసీలో ఇంజిన్‌కు వాటిల్లే నష్టానికి రక్షణ ఉండదు

డ్యాష్‌బోర్డు స్థాయికి వర్షపునీరు చేరుతుంటే సర్వీసింగ్‌ యూనిట్‌కు కాల్‌ చేయాలి


సంజయ్‌దత్తా అండర్‌రైటింగ్, క్లెయిమ్స్‌ చీఫ్, ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా