వర్షాల్లో వాహన రక్షణ..

12 Sep, 2016 02:09 IST|Sakshi
వర్షాల్లో వాహన రక్షణ..

వర్షాకాలంలో చాలామంది లాంగ్ డ్రైవ్‌కు వెళ్తారు. దీనికి కారణం ఈ కాలంలో ప్రకృతి కొత్త అందాలతో మనల్ని ముగ్దుల్ని చేస్తుంది. అయితే రోడ్లన్నీ వర్షపు నీటితో దెబ్బతిని ఉంటాయన్నది కూడా గుర్తుంచుకోవాలి. దీని వల్ల వాహనాలు పాడవడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిల్లో ముఖ్యమైనది బీమా తీసుకోవడం. కొత్తగా వెహికల్ కొనుగోలు చేసేటప్పుడే బీమా తీసుకోవాలి. కానీ ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 50% వాహనాలకు సరైన బీమా లేదు. వర్షాకాలం వస్తోందంటే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం..
 
వాహనాన్ని కండీషన్‌లో పెట్టుకోండి
సర్వీసింగ్:
వాహనాలను క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో సర్వీసింగ్‌కు ఇవ్వాలి. ఆయిల్ మార్చడం, ఎయిర్ /ఫ్యూయెల్ ఫిల్టర్లను శుభ్రం చేయడం వంటి పనులను తప్పక చేసుకోవాలి. సస్పెన్షన్ జాయింట్స్, సెలైన్సర్ పైప్స్‌ను చెక్ చేసుకోవాలి. ఇలాంటివే వర్షాకాలంలో ఎక్కువగా డ్యామేజ్‌కు గురవుతాయి.
 
టైర్లు: వర్షపు నీటి వల్ల రోడ్లపై వాహనాలు జారిపోతుంటాయి. టైర్ల గ్రిప్ తగ్గడమే ఇందుకు కారణం. ఇలా జరగకుండా ఉండాలంటే వాహన టైర్లను ఒకటికి రెండుసార్లు బాగున్నాయో లేదో చూసుకోవాలి. బాగులేకపోతే వెంటనే మార్చుకోవడం ఉత్తమం. బాగుంటే సమస్య లేదు.

హెడ్ లైట్స్/ఎమర్జెన్సీ లైట్స్: వాహనపు హెడ్ లైట్స్/ ఎమర్జెన్సీ లైట్స్ సక్రమంగా పనిచేస్తున్నాయా? లేదా? అని చూసుకోవాలి. వర్షాకాలంలో బండిని నడుపుతున్నామంటే ఇవి కచ్చితంగా ఉండాలి. అవి పగలి పోయినా.. పాడయినా.. వెంటనే మార్చుకోండి. కొత్త బల్బులను వేసుకోండి.
 
బ్రేక్స్: వర్షపు నీటి వల్ల బ్రేక్ సరిగా పడకపోవచ్చు. అందుకే బ్రేక్స్ బాగా పడుతున్నాయా? లేదా? చూసుకోవాలి. బ్రేక్ ఆయిల్‌ను విధిగా మార్చుకోవడంతోపాటు దానికి సంబంధించిన ఇతర భాగాలు కండీషన్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.  
 
వైపర్స్: ముఖ్యంగా వర్షాకాలంలో వీటితో మనకు చాలా అవసరం ఉంటుంది. అద్దంపై పడ్డ నీటిని ఇవే తొలిగించాలి. ఇవి బాగా పనిచేస్తుంటే పర్వాలేదు. లేకపోతే వెంటనే మార్చుకోండి.

అలాగే డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు మీ వాహనానికి, ముందు వెహికల్‌కు మధ్య ఎక్కువ దూరం ఉండేలా చూసుకోండి. మన వాహనం బ్రేక్ వేసిన వెంటనే నిలబడకపోవచ్చు.  
 
వీటిని మరిచిపోవద్దు
వాహనానికి తప్పక బీమా చేసుకోండి. బండికి ఏదైనా డ్యామేజ్ అయితే బీమా మనకు బాసటగా నిలుస్తుంది. నష్ట నివారణలో మనకు తో డ్పాటునందిస్తుంది. పేరొందిన బీమా కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకోవడం ఉత్తమం.  
ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే దానికి రెన్యువల్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. బీమాతోపాటు ఇంజిన్ గార్డ్ వంటి వాటిని తీసుకోండి. కొన్ని పాలసీలు ఇంజిన్ లోపలి భాగాలు డ్యామేజ్ అయితే వాటికి బీమా ఇవ్వటం లేదు. ఈ ఇంజిన్ గార్డ్ అందుకు ఉపయోగపడుతుంది.
కారు ఇంజిన్‌లోకి నీళ్లు పోతే బండిని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించొద్దు. మంచి మెకానిక్‌కు కాల్ చేసి, ఆయన సాయం తీసుకోండి.
నీరు వాహన టైర్ల కన్నా పైకి ఉంటే అప్పుడు బండిని నడ పొద్దు. నిలిపేయండి.
బండి నీటిలో మునిగిపోతే బ్యాటరీ కనెక్షన్‌ను తొలగించండి.
ఇన్సూరెన్స్ కంపెనీ డాక్యుమెంట్లను బండిలో ఉంచుకోండి. అలాగే కంపెనీ టోల్‌ఫ్రీ నంబర్లను నోట్ చేసుకోండి. డ్యామేజ్‌ను త్వరగా క్లెయిమ్ చేయడానికి ప్రయత్నించండి.
 
- పునీత్ సాహ్ని, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్
 ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్

>
మరిన్ని వార్తలు