వెరైజన్‌ చేతికి యాహూ

14 Jun, 2017 01:07 IST|Sakshi
వెరైజన్‌ చేతికి యాహూ

4.5 బిలియన్‌ డాలర్ల డీల్‌ పూర్తి
శాన్‌ ఫ్రాన్సిస్కో: ఇంటర్నెట్‌కి పర్యాయపదంగా వెలుగొందిన దిగ్గజ సంస్థ యాహూ .. రెండు దశాబ్దాల ప్రస్థానానికి తెరపడింది. దాదాపు 4.5 బిలియన్‌ డాలర్లకు యాహూను కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు టెక్‌ దిగ్గజం వెరైజన్‌ ప్రకటించింది. ఈ డీల్‌ కింద యాహూ సీఈవోగా వైదొలగనున్న మరిస్సా మేయర్‌కు 127 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీ దక్కనుంది.

యాహూతో పాటు వివిధ ఏవోఎల్‌ సర్వీసు విభాగాలన్నింటినీ కలిపి ఓత్‌ పేరిట ఏర్పాటు చేసే వెరైజన్‌ అనుబంధ సంస్థకు టిమ్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ సీఈవోగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఏవోఎల్‌ ఇన్‌చార్జ్‌ అయిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఇకపై యాహూ ఈమెయిల్, స్పోర్ట్స్, ఫైనాన్స్, న్యూస్‌ మొదలైన విభాగాలను కూడా పర్యవేక్షించనున్నారు.

మరోవైపు  పలు వ్యాపార విభాగాలను వెరైజన్‌కి విక్రయించిన యాహూ.. ఆలీబాబా గ్రూప్, యాహూ జపాన్‌లో వాటాలను తన దగ్గరే అట్టే పెట్టుకుంది. ఈ విభాగాలతో అల్తబా పేరుతో కొత్తగా మరో సంస్థ ఏర్పాటు కానుంది. యాహూ వద్ద ఉన్న 8 బిలియన్‌ డాలర్ల పైగా నగదు నిల్వలు, ఇతరత్రా న్యాయపరమైన వివాదాలు ఈ సంస్థకి సంక్రమించనున్నాయి.

మరిన్ని వార్తలు