పీఎంసీ స్కాం : భిక్షగాళ్లుగా మారిపోయాం

10 Oct, 2019 13:19 IST|Sakshi
పీఎంసీ ఖాతాదారుల ఆందోళన

పీఎంసీ బ్యాంకు డిపాజిటర్ల ఆందోళన

బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

సాక్షి, ముంబై: పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్  కుంభకోణం డిపాజిటర్లను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేసింది.  ఆర్‌బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాలనుంచి   నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచినప్పటికీ డిపాజిటర్లు తాజాగా మరోసారి ఆందోళనకు దిగారు. ముంబైలోని నారిమన్‌ పాయింట్‌లోని బీజేపీ కార్యాలయం ముందు గురువారం  నిరసనకు దిగారు.  కేవలం  రూ.25 వేలతో  తమ అవసరాలను ఎలా తీర్చుకోవాలంటూ వందలాంది మంది  బాధిత ఖాతాదారులు వాపోయారు.  తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చే‍స్తూ పెద్ద  ఎత్తున నినాదాలు చేశారు.  దీంతోఅక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఈ సందర్బంగా కృష్ణ అనే డిపాజిటర్  మాట్లాడుతూ అసలు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడంలేదనీ,  తనకు డబ్బు తిరిగి కావాలని డిమాండ్‌ చేశారు. మళ్లీ ఈ సొమ్మును తిరిగి సంపాదించుకోలేనంటూ ఆవేదన చెందారు.  దీంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  బీజేపీ కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. రాత్రికి రాత్రే తమ ఖాతాలను స్తంభింప చేస్తు పరిస్థితి ఏంటని ఆగ్రహంతో ప్రశ్నించారు.  తామేమీ నేరం చేయకపోయినా తమ కష్టార్జితంకోసం భిక్షగాళ్లలా ప్రభుత్వాన్ని అర్థించాల్సి వస్తోందని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో నిర్మలా సీతారామన్‌ మీడియా సమావేశం నిర్వహించనున్నారని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు