మాల్యా చాపర్స్‌ రూ.8 కోట్లకు పైననే పలికాయి

20 Sep, 2018 09:17 IST|Sakshi

బెంగళూరు : బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా హెలికాప్టర్లను వేలం వేశారు. బెంగళూరులోని డెట్‌ రికవరీ ట్రైబ్యునల్‌(డీఆర్‌టీ-1) ఈ-ఆక్షన్‌ను నిర్వహించి, బిజినెస్‌ టైకూన్‌ మాల్యాకు చెందిన రెండు హెలికాప్టర్లను ఢిల్లీకి చెందిన చౌదరి ఏవియేషన్‌కు అమ్మేసింది. ‘మాల్యాకు చెందిన రెండు వ్యక్తిగత హెలికాప్లర్లను తమ కంపెనీ రూ.8.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఒక్కోటి రూ.4.37 కోట్లు’ అని చౌదరీ ఏవియేషన్‌ డైరెక్టర్‌ సత్యేంద్ర సెహ్రావత్ ప్రకటించారు. 17 బ్యాంకుల కన్సోర్టియం తరుఫున రికవరీ కోర్టు ఈ ఈ-ఆక్షన్‌ను నిర్వహించింది. 2007-2012 మధ్య తీసుకున్న రూ.9వేల కోట్లకు పైగా రుణాలను మాల్యా, ఆయనకు చెందిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ లిమిటెడ్‌ చెల్లించకుండా చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. ఆ అనంతరం 2016లో మాల్యా దేశం విడిచిపారిపోయారు. 

తాము కొనుగోలు చేసిన 5 సీటర్‌ ఎయిర్‌బస్‌ యూరోకాప్టర్‌ బీ155 చాపర్స్‌ 10 ఏళ్ల కాలం నాటివని, ఇవి మంచి డ్యూయల్‌ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయని సత్యేంద్ర తెలిపారు. ప్రస్తుతం ఇవి ముంబైలోని జుహు ఎయిర్‌పోర్ట్‌లో పార్క్‌ చేసి ఉంచినట్టు పేర్కొన్నారు. ఈ ఈ-ఆక్షన్‌లో మొత్తం మూడు కంపెనీలే పాల్గొన్నాయి. 2008 మోడల్‌కు చెందిన ఒక్కో హెలికాప్టర్‌ కనీస బిడ్‌ ధరగా రూ.1.75 కోట్లను నిర్ణయించింది రికవరీ కోర్టు‌. ఈ చాపర్లను వాణిజ్య అవసరాల కోసం వినియోగించుకోనున్నామని సత్యేంద్ర తెలిపారు. చౌదరి ఏవియేషన్‌ ప్రస్తుతం గ్రౌండ్‌ ఆపరేషన్లను నిర్వహించడమే కాకుండా.. దేశ రాజధాని పరిధిలోని ఆసుపత్రులకు ఎయిర్‌ అంబులెన్స్‌ సర్వీసులను అందజేస్తుంది. ఈ-ఆక్షన్‌ నిర్వహిస్తున్న విషయాన్ని రికవరీ కోర్టు అసలు మీడియాకు వెల్లడించలేదు.   

మరిన్ని వార్తలు