భారత్‌కు మాల్యా.. 28 రోజుల్లో

15 May, 2020 02:57 IST|Sakshi

బ్రిటన్‌ హోంమంత్రి ఆమోదం తర్వాత అప్పగింత

న్యాయపరమైన అవకాశాలన్నీ కోల్పోయిన విజయ్‌ మాల్యా..

సుప్రీంకోర్టులో అప్పీల్‌కు నో చెప్పిన హైకోర్టు

లండన్‌: వ్యాపార వేత్త, బ్యాంకులకు రూ.9,000 కోట్లు ఎగవేసి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌మాల్యా (64) న్యాయపరమైన పోరాటంలో చివరి అవకాశాన్ని కూడా కోల్పోయారు. దీంతో ఆయన్ను భారత్‌కు అప్పగించడం దాదాపుగా ఖరారైపోయినట్టే. ఈ ప్రక్రియ గరిష్టంగా 28–30 రోజుల్లోపు పూర్తికానుంది. బ్రిటన్‌ హోంమంత్రి ఆమోదం తర్వాత మాల్యాను భారత్‌కు అప్పగించే ప్రక్రియను పూర్తి చేస్తారు. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ మూతపడడం, ఎయిర్‌లైన్స్‌ సంస్థ తరఫున తీసుకున్న సుమారు రూ.9,000 కోట్ల రుణాలను చెల్లించకపోవడంతో.. మాల్యాపై మనీలాండరింగ్, మోసపూరిత అభియోగాలతో భారత దర్యాప్తు సంస్థలు (సీబీఐ, ఈడీ) బ్రిటన్‌లో న్యాయపరమైన చర్యలను చేపట్టాయి.

‘బ్రిటన్‌–భారత్‌ మధ్య అప్పగింత ఒప్పందం’ కింద మాల్యాను తమకు అప్పగించాలని కోరాయి. ఇందుకు అనుకూలంగా వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 2018 డిసెంబర్‌లోనే ఆదేశాలు వెలువరించింది. ఈ ఆదేశాలను బ్రిటన్‌ హైకోర్టు సమర్థించగా.. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసుకునేందుకు మాల్యాకు 14 రోజుల గడువు ఉంది. అయితే, సుప్రీంకోర్టులో అప్పీల్‌ కోసం అనుమతించాలన్న ఆయన దరఖాస్తును తాజాగా లండన్‌ హైకోర్టు కొట్టివేసింది. సాధారణ ప్రజా ప్రాముఖ్యత కోణంలో సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చన్న న్యాయపరమైన అంశాన్ని ధ్రువీకరించేందుకు తిరస్కరిస్తున్నట్టు లండన్‌లోని రాయల్‌ కోర్ట్స్‌ ఆఫ్‌ జస్టిస్‌ ధర్మాసనం స్పష్టం చేసింది. యూకే ఎక్స్‌ట్రాడిషన్‌ యాక్ట్‌ 2003 చట్టంలోని సెక్షన్‌ 36, సెక్షన్‌ 116 కింద అప్పగింత ప్రక్రియను నిర్ధేశించిన 28 రోజుల్లోపు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. పెద్ద ఎత్తున బ్యాంకులకు రుణాలను ఎగవేసిన వ్యాపారవేత్తలను విదేశాలకు పారిపోనిచ్చారంటూ మోదీ సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఒక్క చాన్స్‌!
అయితే, ఒక్క అవకాశం మాత్రం మాల్యాకు మిగిలి ఉంది. యూరోపియన్‌ కోర్ట్‌ ఆఫ్‌ çహ్యూమన్‌రైట్స్‌ (ఈసీహెచ్‌ఆర్‌)ను ఆశ్రయించొచ్చు. పారదర్శక విచారణ లభించలేదంటూ యూరోపియన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ హ్యూమన్‌ రైట్స్‌లోని ఆర్టికల్‌ 3 కింద అప్పగింతను నిరోధించాలంటూ కోరొచ్చు. అయితే, ఈసీహెచ్‌ఆర్‌లో అప్పీల్‌ కు అవకాశాలు చాలా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఇవే అంశాల ఆధారంగా ఇప్పటికే కోర్టుల్లో  వాదనలు వీగిపోవడాన్ని పేర్కొంటున్నారు.  

రుణాలు చెల్లించేస్తా.. వదిలిపెట్టండి
ఓటమిని గుర్తించిన మాల్యా మరోసారి రుణాలన్నింటినీ తిరిగి చెల్లిస్తానని, వాటిని తీసుకుని తనపై ఉన్న కేసును మూసేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘కరోనా ప్యాకేజీ కోసం భారత ప్రభుత్వం నచ్చినంత నగదును ముద్రించుకోగలరు. కానీ, ప్రభుత్వ బ్యాంకులకు చెల్లించాల్సిన నూరు శాతాన్ని తిరిగి చెల్లించేస్తానంటున్న నా విన్నపాన్ని అదే పనిగా విస్మరిస్తున్నారు. ఎటువంటి షరతుల్లేకుండా నా నుంచి డబ్బులు తీసుకోండి. కేసును క్లోజ్‌ చేయండి’’ అంటూ విజయ్‌మాల్యా ట్వీట్‌ చేశారు.   

తదుపరి ఏమిటి..?
► విజయ్‌ మాల్యాను భారత్‌కు అప్పగించిన తర్వాత దర్యాప్తు సంస్థలు ఆయన్ను ఇక్కడి కోర్టుల్లో ప్రవేశపెట్టి విచారణ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది.
► ముంబైలోని ఆర్ధర్‌రోడ్డు జైలులో బరాక్‌ 12లో ఆయన్ను పూర్తి స్థాయి వైద్య సదుపాయాలతో ఉంచుతామని దర్యాప్తు సంస్థలు లోగడే బ్రిటన్‌ కోర్టులకు తెలియజేశాయి.
► విజయ్‌మాల్యా 2016 మార్చిలో బ్రిటన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన్ను పారిపోయినట్టు భారత్‌ ప్రకటించింది.  
► 2017లో ఏప్రిల్‌ 18న అప్పగింత వారెంట్‌పై ఆయన్ను అరెస్ట్‌ చేయగా, బెయిల్‌పై బయట ఉన్నారు.  
► 2018 డిసెంబర్‌లో చీఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు అప్పగింతకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసింది.
► దీన్ని 2020 ఏప్రిల్‌లో బ్రిటన్‌ హైకోర్టు సమర్థించింది. దీనిపై అప్పీల్‌ చేసుకునేందుకు తాజాగా అనుమతించలేదు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా