రెండేళ్లలో అనుసంధానం పూర్తి

15 Apr, 2019 07:18 IST|Sakshi

దేనా బ్యాంకు, విజయబ్యాంకుల విలీనంపై బీవోబీ

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు విలీనం కాగా, వీటి మధ్య అనుసంధానత రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్‌ 1 నుంచి దేనా బ్యాంకు, విజయాబ్యాంకులు బ్యాంకు ఆఫ్‌ బరోడాలో విలీనమై ఒక్కటిగా  మారిన విషయం తెలిసిందే. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ అనుసంధానానికే 12 నెలల వరకు సమయం తీసుకోవచ్చని, ఇతర వ్యవస్థల మధ్య అనుసంధానతకు మరో ఏడాది పట్టొచ్చని ఆ అధికారి పేర్కొన్నారు.

ఈ సమయంలో ఖాతాదారులకు అసౌకర్యాన్ని పరిమితం చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. విలీనం వల్ల ఏర్పడే అదనపు వ్యయాలను దృష్టిలో ఉంచుకుని, నియంత్రణపరమైన అవసరాల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.5,042 కోట్ల నిధులు సమకూర్చినట్టు ఆ అధికారి తెలిపారు. విలీన ప్రభావం మొదటి త్రైమాసికమైన ఏప్రిల్‌–జూన్‌ కాలంలో కార్యకలాపాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందన్నారు. విలీనానంతర బ్యాంకుకు రూ.8.75 లక్షల కోట్ల డిపాజిట్లు, రూ.6.25 లక్షల కోట్ల రుణ పుస్తకం ఉంటాయి. విలీనం తర్వాత బీవోబీ ప్రభుత్వ రంగంలో ఎస్‌బీఐ తర్వాత రెండో అతిపెద్ద బ్యాంకుగా అవతరించింది. 9,500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు, 12 కోట్ల ఖాతాదారులు బ్యాంకుకు ఉన్నారు. 

మరిన్ని వార్తలు