విజయాబ్యాంకు లాభం 3 రెట్లు

10 May, 2017 05:22 IST|Sakshi

విజయ బ్యాంక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో మూడు రెట్లదాకా పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.71 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.204 కోట్లకు పెరిగిందని బ్యాంక్‌ పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.3,228 కోట్ల నుంచి రూ.3,505 కోట్లకు చేరింది.

 గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్లో రూ.8,305 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం మార్చి క్వార్టర్లో 23 శాతం తగ్గి రూ.6,382 కోట్లకు చేరాయి.  కేటాయింపులు 34 శాతం క్షీణించి రూ.553  కోట్లకు తగ్గాయి. ఒక్కో షేర్‌కు రూ.1.50(15 శాతం) డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపింది.

మెరుగుపడిన రుణ నాణ్యత..: ఇక 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.382 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపై రూ.750 కోట్లకు పెరిగింది. కేటాయింపులు తక్కువగా ఉండడం, ఇతర ఆదాయం అధికంగా రావడం వంటి కారణాల వల్ల నికర లాభం ఈ స్థాయిలో పెరిగింది.

మరిన్ని వార్తలు