దీర్ఘకాలంలో మంచిదే.. కానీ.. 

21 Sep, 2018 00:45 IST|Sakshi

స్వల్పకాలికంగా ఎన్‌పీఏలు పెరుగుతాయ్‌..

3 బ్యాంకుల విలీనంపై ఇండియా రేటింగ్స్‌ నివేదిక 

ముంబై: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్‌ల విలీనంతో స్వల్పకాలికంగా మొండిబాకీలు ఎగియడం వంటి సవాళ్లు ఉంటాయని ఇండియా రేటింగ్స్‌ ఒక నివేదికలో పేర్కొంది. అయితే, దీర్ఘకాలంలో మాత్రం ఈ విలీనంతో ప్రయోజనాలు ఉండగలవని వివరించింది. ప్రతిపాదిత విలీనానికి లాంఛనంగా ఆమోదముద్ర వచ్చిన తర్వాత.. రేటింగ్‌ను మదింపు చేస్తామని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. దేనా బ్యాంక్‌కు తక్కువ మూలధన నిల్వలు ఉన్నప్పటికీ.. విజయా బ్యాంక్‌ వద్ద అధిక స్థాయిలో ఉన్నందున.. ఆ మేరకు సర్దుబాటు జరుగుతుందని పేర్కొంది. విలీన బ్యాంక్‌కు మాత్రం అదనంగా మూలధనం అవసరమవుతుందని వివరించింది. దీర్ఘకాలిక ప్రాతిపదికన చూస్తే నిర్వహణ వ్యయాలు .. నిధుల సమీకరణ వ్యయాలు తగ్గడం, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ విధానాలు పటిష్టం కావడం వంటి సానుకూల ప్రయోజనాలు ఉంటాయని ఇండియా రేటింగ్స్‌ వివరించింది.  

మరిన్ని బ్యాంకులను విలీనం చేసుకోలేం...
ప్రస్తుతం మరిన్ని బ్యాంకులను టేకోవర్‌ చేసే పరిస్థితిలో ఎస్‌బీఐ లేదని ఆ బ్యాంకు చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అనుబంధ బ్యాంకుల విలీనంతో చేకూరిన ప్రయోజనాలు కనిపించడానికి కనీసం 2–3 సంవత్సరాలైనా పడుతుందని ఆయన వివరించారు. ఎస్‌బీఐకి 23 శాతం మార్కెట్‌ వాటా ఉందని, మరిన్ని బ్యాంకులను చేర్చుకోవడం వల్ల గుత్తాధిపత్యానికి దారి తీసే అవకాశాలు ఉన్నాయని రజనీష్‌ కుమార్‌ తెలిపారు. అయితే, మెరుగైన నిర్వహణ కోసం విలీనాల ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం మాత్రం ఉందన్నారు. 

>
మరిన్ని వార్తలు