మాల్యా చెక్ బౌన్స్ కేసు మరోసారి వాయిదా

5 Jul, 2016 11:06 IST|Sakshi
మాల్యా చెక్ బౌన్స్ కేసు మరోసారి వాయిదా

హైదరాబాద్ :  వేలకోట్ల  రూపాయలు  బ్యాంకులకు ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయి, రుణాలు చెల్లించేందుకు ముప్పతిప్పలు పెడుతున్న లిక్కర్ కింగ్, పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యా చెక్ బౌన్స్ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.   కింగ్ ఫిషర్ చెక్ బౌన్స్ కేసు విచారణను హైదరాబాద్ కోర్టు మంగళవారం  ఆగష్టు 4 వరకు వాయిదా వేసింది. వాయిదాల వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసు విచారణ  ఇటీవల జులై అయిదుకి వాయిదా పడింది.  దీంతో నేడు  విచారణ చేపట్టిన హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు...తదుపరి విచారణను మరో నెలపాటు వాయిదా వేసింది.

కింగ్‌ఫిషర్ విమానాల కోసం శంషాబాద్ ఎయిర్‌పోర్టును వినియోగించుకున్నందుకుగాను జీఎంఆర్‌కు మాల్యా రూ. 50లక్షలు విలువ చేసే రెండు చెక్కులను ఇచ్చారు. బ్యాంక్ ఖాతాల్లో నగదు లేకపోవడంతో ఈ రెండు చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీనిపై జీఎంఆర్ సంస్థ  కోర్టును ఆశ్రయించింది. దీంతో మాల్యాను కోర్టులో హాజరుపర్చాలని కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. సమన్లు జారీ చేసిన చిరునామాలో ఉన్న నివాసాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై బ్రాంచ్ సీజ్ చేయడంతో సమన్ల జారీ ప్రక్రియ చిక్కుల్లో పడింది. ఆయన అక్కడ ఉండడం లేదని వివరిస్తూ మహారాష్ట్ర పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో మాల్యా నివసిస్తున్న సరైన చిరునామా  ఇవ్వాలని న్యాయవాది ఎం కృష్ణారావు ఈ సందర్భంగా జీఎంఆర్కు సూచించిన నేపథ్యంలో  కేసు విచారణను వాయిదా వేసింది.  జీఎంఆర్ సంస్థకు విజయ్ మాల్యా చెల్లించాల్సిన 8 కోట్ల రూపాయలకు గాను ఆయనపై మొత్తం 11 కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు