ఉచిత టిక్కెట్లు : జెట్‌ ఎయిర్‌వేస్‌ క్లారిటీ

24 May, 2018 20:28 IST|Sakshi

న్యూఢిల్లీ : సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాల్లో నిజాలెంత ఉంటాయో? అబద్ధాలు కూడా అంతే. ఇటీవల జెట్‌ ఎయిర్‌వేస్‌ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత విమాన టిక్కెట్లు ఇస్తుందంటూ మెసేజ్‌లు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ మెసేజ్‌లో నిజమెంత ఉందో, అబద్ధమెంతో జెట్‌ ఎయిర్‌వేస్‌ తేల్చేసింది. తాము ఎటువంటి ఉచిత టిక్కెట్లు ఇవ్వడం లేదని, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవమేనని జెట్ ఎయిర్‌వేస్‌ బుధవారం స్పష్టంచేసింది. ఇది 100 శాతం పూర్తిగా అవాస్తవమని తెలిపింది. అధికారిక ఖాతాలను నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కస్టమర్లకు సూచించింది. 

‘25 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జెట్ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ రెండు టికెట్లు ఉచితంగా ఇస్తున్నట్లు వస్తోన్న సందేశాలన్నీ పూర్తిగా అవాస్తవం. అది అధికారిక సమాచారం కాదు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే ఎయిర్‌వేస్ అధికారిక ఖాతాల్లోనే ఉంచుతాం. దానికి బ్లూ టిక్‌ మార్క్‌ ఉంటుంది’ అని జెట్‌ ఎయిర్‌వేస్‌ ట్వీట్‌ చేసింది. 25వ వార్షికోత్సవ సందర్భంగా జెట్‌ఎయిర్‌వేస్‌ ప్రతి ఒక్కరికీ రెండు ఉచిత టిక్కెట్లు ఇస్తోందని, ఆ లింక్‌ను మరో 20 మందికి షేర్‌ చెయ్యాలని, దాంతో 48 గంటల్లో యూజర్ మెయిల్ ఐడీకి టికెట్లు అందుతాయని ఆ మెసేజ్‌లో ఉంది. అయితే అదంతా పూర్తిగా అవాస్తవమని జెట్ ఎయిర్‌వేస్‌ తేల్చేసింది. ఈ వైరల్‌ మెసేజ్‌పై బుధవారం క్లారిటీ ఇచ్చింది. ఎయిర్‌లైన్‌ ప్రకటనపై స్పందించిన చాలామంది ట్విటర్‌ యూజర్లు తాము ఈ మెసేజ్‌ను పొందామని, క్లిక్‌ కూడా చేసినట్టు పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు