విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం స్థిరీకరించాలి

24 Jun, 2015 00:22 IST|Sakshi
విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం స్థిరీకరించాలి

కేంద్ర ఉక్కు మంత్రి తోమర్
 
 సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విస్తరణ, ఆధునీకరణ వల్ల విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ మెరుగైన లాభాలు సాధించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉక్కు శాఖమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఉక్కు ఉత్పత్తిలో అవాంతరాలు, జాప్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా  చూడాలన్నారు. కేంద్రమంత్రి తోమర్ విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను మంగళవారం సందర్శించారు. ఉక్కు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. కోక్ ఓవెన్ బ్యాటరీ, బ్లాస్ట్‌ఫర్నేస్ 3, స్టీల్‌మెటల్ షాప్-2, వైర్‌రాడ్ మిల్-2లను సందర్శించారు. అనంతరం స్టీల్‌ప్లాంట్ సీఎండీ మధుసూదన్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి తోమర్ మాట్లాడుతూ విస్తరణ, ఆధునీకరణ, ఉత్పత్తి వ్యయం తగ్గింపు, ఇంధన పొదుపు తదితర చర్యలు  స్టీల్‌ప్లాంట్ లాభాలపై గణనీయంగా సానుకూల ప్రభావం చూపించాలన్నారు. స్టీల్‌ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని స్థిరీకరించాలని ఆదేశించారు.  త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ స్టీల్‌ప్లాంట్ పర్యటనను విజయవంతం చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో విశాఖపట్నం ఎంపీ కె.హరిబాబు, కేంద్ర ఉక్కు శాఖ సంయుక్త కార్యదర్శి ఊర్‌విల్ల ఖతిలతోపాటు స్లీట్‌ప్లాంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు