విశాఖకు ఐబీఎం సీఎస్‌ఆర్ సేవలు..

28 May, 2015 01:36 IST|Sakshi
విశాఖకు ఐబీఎం సీఎస్‌ఆర్ సేవలు..

సాక్షి, విశాఖపట్నం: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్‌ఆర్) కింద ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 16 నగరాలను ఎంపిక చేసుకుని ఆయా నగరాల్లో వివిధ అంశాల్లో చేయూతనివ్వాలని నిర్ణయించినట్టు అంతర్జాతీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఐబీఎం సీఎస్‌ఆర్ (ఇండియా) హెడ్ మమతాశర్మ అన్నారు. బుధవారం ఆమె విశాఖ కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడుతూ భారత్‌లో విశాఖతో సహా సూరత్, అలహాబాద్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నందున. ఈ మూడు నగరాల్లో సీఎస్‌ఆర్ కింద సహకారం అందించాలని నిర్ణయించామన్నారు.

సూరత్‌లో నూరు శాతం సౌరసేవలు, అలహాబాద్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, విశాఖలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విషయంలో సీఎస్‌ఆర్ నిధులను వెచ్చించి అవసరమైన సాంకేతిక, నైపుణ్యతను ఐబీఎం అందజేస్తుందన్నారు. విశాఖలో  తుపాన్‌లు ఎదుర్కొనే ప్రణాళికలను ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి రూపొందించి అందిస్తామన్నారు. ఇందుకోసం విపత్తులను అధ్యయనం చేయడంలో అనుభవం గల అంతర్జాతీయ స్థాయినిపుణులను విశాఖకు రప్పించి ఇక్కడి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి జిల్లా యంత్రాంగాన్ని అందిస్తా మన్నారు.

ఇందుకయ్యే ఖర్చునంతటినీ తమ సంస్థ భరిస్తుందన్నారు. ఈ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా జిల్లా యంత్రాంగంతో పాటు విశాఖ నగరంలోని పలు వర్గాల వారితో చర్చించి నివేదిక తయారుచేస్తామన్నారు.

మరిన్ని వార్తలు