ఇన్ఫోసిస్‌పై ట్రంప్ ప్రభావం ఎంత?

18 Nov, 2016 19:31 IST|Sakshi
ఇన్ఫోసిస్‌పై ట్రంప్ ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడిగా కొత్తగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ విధానాల కారణంగా.. ఈసారి ఇన్ఫోసిస్ లాభాల మీద ప్రభావం పడే అవకాశం ఉందంటున్నారు. తాను తీసుకునే టాప్ 3 విధాన నిర్ణయాల్లో ఇమ్మిగ్రేషన్ ఒకటని ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. దానివల్ల సంస్థ లాభాల మీద ప్రభావం పడొచ్చని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా చెప్పారు. అయితే, ఈ ప్రభావం ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చన్న విషయంపై మాత్రం కంపెనీ ఇంకా ఒక అంచనాకు రాలేకపోతోంది. భారతీయ ఉద్యోగులైతే తక్కువ జీతాలతోనే తాత్కాలిక వర్క్ పర్మిట్ వీసాలతో విదేశాలకు కూడా పంపి అక్కడ పనిచేయించుకోవడం సులభం అనేది ఇక్కడి కంపెనీల భావన. అమెరికన్లను అక్కడ ఉద్యోగాల్లోకి తీసుకుంటే వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేతప్ప అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు దొరకరనే సమస్య మాత్రం లేదని సిక్కా అంటున్నారు. 
 
అక్కడ కూడా కావల్సినన్ని యూనివర్సిటీలున్నాయని, కావల్సినంత మంది ఇంజనీర్లు దొరుకుతారని చెప్పారు. అయితే.. ఇప్పుడు అక్కడివారిని ఉద్యోగాల్లోకి తీసుకోకపోతే అమెరికా మార్కెట్‌ను కాగ్నిజెంట్ లాంటి పోటీదారులకు వదులుకోవాల్సి వస్తుంది. అందుకే ఎలాగోలా ఖర్చు పెరిగినా సరే.. అక్కడి ప్రాజెక్టులను మాత్రం వదులుకోకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్ తన వార్షిక రెవెన్యూ వృద్ధి లక్ష్యాలను మూడు నెలల్లో రెండోసారి తగ్గించుకుంది. చాలావరకు పాశ్చాత్య దేశాల క్లయింట్లు ఖర్చు తగ్గించుకోవాలని నిర్ణయించడంతో ఇక్కడి సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతి కంపెనీలకు ఆదాయం తగ్గుతోంది. ఈ ప్రభావం ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీల మీద కూడా పడింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకెంత తీవ్రంగా ఉంటుందో చూడాలి. 
మరిన్ని వార్తలు