ఉమెన్స్‌ డే..విస్తారా కీలక నిర్ణయం

7 Mar, 2019 18:06 IST|Sakshi

సాక్షి, ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా  ప్రముఖ ప్రైవేటు విమానయాన సంస్థ  విస్తారా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది.  మార్చి 8నుంచి విస్తారా విమానాల్లో ప్రయాణించే మహిళా ప్రయాణీకులకు ఉచిత శానిటరీ నాప్‌కిన్లు సదుపాయాన్ని కల్పించనున్నారు. విస్తారాకు చెందిన అన్ని దేశీయ విమాన సర్వీసుల్లో ఈ సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ  తేదీ నుంచి ఈ సదుపాయాన్ని కల్పించనున్నామని  విస్తారా ​కార్పొరేట్‌ వ్యవహరాల సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపా చద్దా వెల్లడించారు. చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి పెద్ద తేడాను తీసుకొస్తాయనే తమ కంపెనీ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకుని శానిటరీ నాప్‌కిన్లు ఉచితంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఐఎస్ఓ 9001:2015 గుర్తింపు సాధించిన అత్యంత నాణ్యమైన శానిటరీ నాప్‌కిన్లు క్యాబిన్‌లో సిద్ధంగా ఉంటాయని పేర్కొన్నారు. అలాగే శానిటరీ నాప్‌కిన్ల లభ్యతపై ‘అవసరం ఉన్న వారు విమాన సిబ్బందిని అడిగి వీటిని ఉచితంగా తీసుకోవచ్చంటూ’విమానాల్లో అనౌన్స్‌మెంట్‌కూడా ఉంటుందని  సంస్థ వెల్లడించింది. దీంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి విమానయాన సంస్థగా విస్తారా గుర్తింపు దక్కించుకోనుంది. 

కాగా మహిళలు, యువతులు పీరియడ్‌ సమయంలో అనుభవించే సమస‍్యలు, బాధలపై సమాజంలో ఇపుడిపుడే సానుకూల అవగాహన వస్తూండటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఒకపుడు రుతుస్రావం అనేమాటను ఉచ్చరించడానికే మహిళలు సైతం ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం దీనిపై బహిరంగంగా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో పాతకాలపు భావజాలాన్ని సవాల్‌ చేస్తూ బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా ప్యాడ్‌మాన్‌  సినిమా రావడం ఒక సంచలనం. అలాగే పీరియడ్‌ డాక్యుమెంటరీకి ఆస్కార్‌ అవార్డు రావడం మరో కీలక పరిణామం.

మరిన్ని వార్తలు