కోవిడ్‌: విస్తారా ఆ విమానాలు బంద్‌

18 Mar, 2020 18:20 IST|Sakshi

విస్తారా  అంతర్జాతీయ  విమాన  సర్వీసులు  బంద్‌

మార్చి 20 నుంచి 31వరకు సేవలు నిలిపివేత

సాక్షి, ముంబై:  కోవిడ్‌-19 (కరోనా వైరస్‌ ) విజృంభిస్తున్న తరుణంలో  విమానయాన సంస్థ విస్తారా కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20 నుంచి మార్చి 31 వరకు తన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది.  ముఖ‍్యంగా విమాన ప్రయాణికుల ద్వారా ఈ మహమ్మారి తేలికగా ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న రేపథ్యంలో  విస్తారా ఈ నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్ పరిస్థితి కారణంగా 2020 మార్చి 20 నుండి 2020 మార్చి 31 వరకు అంతర్జాతీయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌, జాయింట్ వెంచర్ సంస్థ విస్తారా బుధవారం తెలిపింది.ప్రభావిత విమానాలలో బుక్ చేసుకున్న వినియోగదారులకు పూర్తిగా చార్జీలను తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. 

కాగా ఇప్పటికే గ్లోబల్‌గా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా బంద్‌ పెట్టిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 15 వరకు అంతర్జాతీయ   విమాన సేవలను నిలిపివేస్తున్నట్టు మార్చి17న  గో ఎయిర్‌ ప్రకటించింది.  చైనాలోని  వుహాన్‌ నగరంలో వ్యాపించి ప్రపంచదేశాలను చుట్టేస్తున్న కరోనా మహమ్మారి, ఇటు మానవ జాతిని, ఇటు  ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో  చనిపోయిన వారి సంఖ్య 8 వేలకు తాకింది. అలాగే ఈ వైరస్‌బారిన పడిన వారి సంఖ్య రెండు లక్షల మార్క్‌ను దాటేసింది. దేశీయంగా కరోనా సోకిన వారికి సంఖ్య 151కి చేరింది.

మరిన్ని వార్తలు