విమాన ఇంధన ధరలు తగ్గాలి

2 Mar, 2015 01:44 IST|Sakshi
విమాన ఇంధన ధరలు తగ్గాలి

5/20 నిబంధన తొలగించాలి
- దీర్ఘకాలిక వృద్ధికి బాటలు వేసే బడ్జెట్
- విస్తార సీఈవో పీ టేక్ యో

ఢిల్లీ నుంచి బిజినెస్ బ్యూరో ప్రతినిధి: ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో విమాన ఇంధన ధరలు (ఏటీఎఫ్) 40-60 శాతం అధికంగా ఉన్నాయని విస్తార చెబుతోంది.

దేశీయంగా విమానయాన రంగం మనుగడ సాగించాలంటే వీటిని తగ్గించాల్సి ఉంటుందని సంస్థ సీఈవో పీ టేక్ యో చెప్పారు. కొత్తగా హైదరాబాద్ నుంచి సర్వీసులు ప్రారంభించడానికి ఇక్కడ ఏటీఎఫ్ మీద పన్నులు తక్కువగా ఉండటం కూడా ఒక కారణమని ఆయన తెలిపారు. విమానయాన సంస్థలు మారుమూల ప్రాంతాలకు కూడా సర్వీసులు నడపాలంటే ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని, ఇందుకోసం రిమోట్ రూట్ ఫండ్ వంటిది ఏర్పాటు చేయాలని చెప్పారు. భారత్‌లో వ్యాపార నిర్వహణ వ్యయాలూ భారీగా ఉంటున్నాయని, ఈ పరిస్థితినీ సరిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
 
బడ్జెట్ భేష్..: సేవాపన్నుల పెంపు స్వల్పకాలికంగా ఏవియేషన్ రంగాన్ని కూడా ఇబ్బంది పెట్టేదిగా ఉన్నప్పటికీ... మొత్తం మీద చూస్తే దీర్ఘకాలికంగా నిలకడైన వృద్ధికి బాటలు వేసేదిగా బడ్జెట్ ఉందని యో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి ఆదివారం విస్తార విమాన సర్వీసులు ప్రారంభించిన సందర్భంగా మీడియాతో ఈ విషయాలు తెలిపారు. ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు పెరగడం ఏవియేషన్‌కి కూడా సానుకూలాంశమేనని చెప్పారు. విదేశాలకు సర్వీసులు నడపాలంటే దేశీయంగా అయిదేళ్ల సర్వీసులు పూర్తి చేయాలని, కనీసం 20 విమానాలు ఉండాలనే 5/ 20 నిబంధనను ప్రభుత్వం త్వరలోనే ఎత్తివేయగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఇతర ఎయిర్‌లైన్స్ ఆపరేటర్ల ప్రయోజనాల కన్నా ప్రజా ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు.
 
డిసెంబర్ నాటికి 9 విమానాలు..
ఈ సంవత్సరాంతానికి తొమ్మిది విమానాలను సమకూర్చుకుంటామని యో చెప్పారు. 2018 నాటికి మొత్తం 20 విమానాలు అందుబాటులోకి వస్తాయని ఆయన వివరించారు. 68 విమాన సర్వీసులతో ప్రారంభించగా ప్రస్తుతం ఈ సంఖ్య 164కి పెంచామని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్-ఢిల్లీ రూట్‌లో రోజూ నాలుగు సర్వీసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రీమియం ఎకానమీ తరగతి సీట్లకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా