2018 నుంచివిస్తారా విదేశీ సర్వీసులు!

14 Jul, 2016 01:25 IST|Sakshi
2018 నుంచివిస్తారా విదేశీ సర్వీసులు!

ముంబై : దేశీ విమానయాన సంస్థ ‘విస్తారా’ అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇది 2018 ప్రధమార్దంలో విదేశాలకు విమానాలను నడిపే అవకాశముంది. ‘ఇప్పటికిప్పుడే ఏదోరకంగా అంతర్జాతీయ కార్యకలాపాలను ప్రారంభించాలని మేం ఊవ్విళ్లూరడం లేదు. కానీ కచ్చితంగా విదేశాలకు విమానాలను నడుపుతాం. దీనికి మేం పూర్తిగా సన్నద్ధం కావాల్సి ఉంది.’ అని విస్తారా చీఫ్ స్ట్రాటజీ, కమర్షియల్ ఆఫీసర్ సంజీవ్ కపూర్ తెలిపారు.

ఆయన ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఇందులో ఆయన యాక్సిస్ బ్యాంక్‌తో కలిసి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ప్రధమంగా సార్క్, గల్ఫ్ దేశాలకు విదేశీ సర్వీసులను నడుపుతామని సంజీవ్ తెలిపారు. తమ వద్ద ఉన్న విమానాలు ఈ ప్రాంతాలకు మాత్రమే రాకపోకలు నిర్వహించగలవని పేర్కొన్నారు.  కాగా విస్తారా దేశంలో తన కార్యకలాపాలను గతేడాది జనవరి 9న ప్రారంభించింది. ప్రస్తుతం 17 గమ్యస్థానాలకు సర్వీసులను నడుపుతోంది. అక్టోబర్ నుంచి పోర్ట్‌బ్లెయిర్‌కు కూడా విమానాలు నడపనున్నది. ప్రస్తుతం విస్తారా వద్ద 11 విమానాలు ఉన్నాయి. సంస్థ అక్టోబర్‌లో మరో రెండింటిని డెలివరీ చేసుకోనున్నది.

మరిన్ని వార్తలు