నష్టాల ఊబిలో విశాఖ ఉక్కు

27 Jun, 2017 00:23 IST|Sakshi
నష్టాల ఊబిలో విశాఖ ఉక్కు

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రానికే తలమానికమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కష్టాల కడలిలో సాగుతోంది. ఒకవైపు  ప్రభుత్వ విధానాలు, మరోవైపు  ముడి సరకు ధరలు పెరుగుదల స్టీల్‌ప్లాంట్‌ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉక్కు తయారీలో వినియోగించే ముడి పదార్దాల ధరలు పెరగడం స్టీల్‌ప్లాంట్‌కు ఇబ్బందులు కలిగిస్తోంది. ఇంపోర్టెడ్‌ కోకింగ్‌ కోల్‌ ధర టన్నుకు ఒకేసారి 8 వేలు పెరగడం, ఐరన్‌ ఓర్‌ ధర కూడా పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం తడిసిమోపెడైపోయింది.

 2015–16లో  ఉత్పత్తి వ్యయం టన్నుకు రూ. 29,376లు కాగా   2016–17లో అది రూ. 33,415కు పెరిగింది.  ఇదే పరిస్థితిలో  దేశీయ స్టీల్‌ కంటే విదేశీ స్టీల్‌ రూ. 5 వేలు నుంచి 6 వేలు తక్కువకు అందుబాటులోకి రావడంతో దేశీయ పరిశ్రమల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది.  చాలా ప్రైవేటు ఉక్కు కంపెనీలు తమ యూనిట్లలో కొన్నింటిని నిలిపి వేయగా ఉక్కు దిగ్గజం సెయిల్‌ కూడా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది.

పెరుగుతున్న అప్పులు.. నష్టాలు
స్టీల్‌ప్లాంట్‌ నెలసరి నిర్వహణ వ్యయం రూ. 1,200 కోట్లు కాగా అమ్మకాలు రూ. సుమారు వెయ్యి కోట్లు ఉంటాయి. దీంతో ప్రతి నెలా సుమారు రూ.150 నుంచి 200 కోట్ల రుణ భారం పెరుగుతోంది. 2015–16లో సుమారు రూ. 1,420 కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2016–17 లో  రూ. 1,271 కోట్ల నష్టం వచ్చింది. 2017–18లో  మొదటి నెలల్లో రూ. 285 కోట్లు నష్టం వాటిల్లింది. ప్లాంట్‌ ఇప్పటివరకు రూ. 15 వేల కోట్ల రుణాలు తీసుకోగా అందులో రూ. 5 వేల కోట్లు ప్లాంట్‌ నిర్వహణ కోసం  కావడం గమనార్హం.

తగ్గిన ఉత్పత్తి
ఈ ఏడాది మొదటి ఆరునెలల్లో ఉత్పత్తి లక్ష్యాల సాధనలో సగానికి పైగా వెనుకబడటం ప్లాంట్‌ యాజమాన్యానికి నిరాశ కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కంటే అంతర్గత లక్ష్యాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ఆరునెలల్లో మంత్రిత్వ శాఖతో చేసుకున్న ఎంవోయూ లక్ష్యాల్లో సగం కూడా చేరుకోకపోవడం యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది.    

ఉత్పత్తిని పెంచడం ద్వారా...
ఉత్పత్తిని పెంచడం ద్వారా ఉత్పాదక వ్యయాన్ని తగ్గించుకుని కంపెనీని లాభాలబాట పట్టించేందుకు యాజమాన్యం ప్రస్తుతం కృషిచేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసి మూడున్నర దశాబ్దాలు దాటినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోక  సొంత గనులకు నోచుకోలేదు.  దీనివల్ల ఉత్పత్తి వ్యయంలో 60 శాతం ముడిపదార్థాలకే ఖర్చవుతోంది. దీనికి తోడు విదేశీ డంపింగ్‌  విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. ప్లాంట్‌ సామర్థ్యాన్ని  6.3 మిలియన్‌ టన్నులు పెంచడానికి సుమారు రూ.14వేల కోట్లు వెచ్చించారు.

  విస్తరణ ప్రయత్నంలో  ఉన్న నగదు  నిల్వలు కరిగిపోవడంతో రుణ సహకారంతో విస్తరణ పనులు చేపట్టాల్సి వచ్చింది. అయితే 6.3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థా ్యనికి చేరుకునే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదురవుతుండటంతో వాటిని సరిచేసే క్రమంలో యాజమాన్యం ముందుకు సాగుతోంది. ఇదే పరిస్థితిలో మరో మిలియన్‌ టన్ను వెరసి 7.3 మి.ట సామర్థ్యానికి ప్లాంట్‌ను పెంచడానికి పనులు ప్రారంభించారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి స్టీల్‌మెల్ట్‌షాప్, బ్లాస్ట్‌ఫర్నేస్‌ల ఉత్పత్తిని పూర్తి స్థాయిలో సాధించేలా యంత్రాలను సిద్ధం చేస్తున్నారు.

మూడేళ్లలో టర్న్‌ అరౌండ్‌ అంచనాలు
విస్తరణ యూనిట్లు స్ధిరీకరణ జరగడంతో పాటు విదేశీ డంపింగ్‌ను నివారించగలిగితే దేశీయ మార్కెట్‌ తప్పకుండా పుంజుకునే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు చెపుతున్నాయి. యాజమాన్యం ప్రణాళిక మేరకు ఈ డిసెంబర్‌కు పూర్తి స్థాయి ఉత్పత్తి ప్రారంభించగలిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు గణనీయంగా తగ్గే అవకాశముందని వారంటున్నారు. ఈ విధంగా ముందుకు సాగితే మూడేళ్లలో టర్న్‌ అరౌండ్‌ సాధించగలమని ఉక్కు యాజమాన్యం అంచనా వేస్తోంది.

మరిన్ని వార్తలు