వైజాగ్ స్టీల్ ప్లాంట్ నికర నష్టం రూ.1421 కోట్లు

30 Sep, 2016 01:06 IST|Sakshi
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నికర నష్టం రూ.1421 కోట్లు

ఉక్కునగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1421 కోట్ల నికర నష్టం వచ్చింది. గురువారం స్టీల్‌ప్లాంట్ సీఎండీ పి.మధుసూదన్ అధ్యక్షతన జరిగిన స్టీల్‌ప్లాంట్ 34వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఈ వివరాలు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంలో 39 శాతం ఉత్పత్తి, 5 శాతం విలువ వృద్ధితో రూ. 12,271 కోట్ల సేల్స్ టర్నోవర్ సాధించామన్నారు.

స్టీల్ ధరలు గణనీయంగా పడిపోవడంతో ఆ ప్రభావంతో రూ. 1421 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. 2015-16లో 6.3 మిలియన్ టన్నుల విస్తరణ పూర్తయిందని, వాటితో పాటు ఆధునికీకరణ పనులు చేపట్టడం వల్ల సంస్థ సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు చేరిందని తెలిపారు. రానున్న కాలంలో విస్తరణ యూనిట్లను స్థిరీకరించడం ద్వారా ఉత్పత్తిని గణనీయంగా పెంచనున్నామన్నారు. ఉక్కు యాజమాన్యం కార్మిక ఉత్పాదకత, కోక్ రేటు, పీసీఐ రేటు,  ఇంధన వినియోగం తగ్గుదల తదితర అంశాలపై నిరంతరం దృష్టి సాధించి ఉత్పత్తి, ఉత్పాదకత పెంపునకు కృషి చేస్తూనే ఉందన్నారు.

 సమావేశంలో రాష్ట్రపతి ప్రతినిధిగా ఉక్కు మంత్రిత్వశాఖ డెరైక్టర్ మహబీర్ ప్రసాద్‌తో పాటు,  స్టీల్‌ప్లాంట్ డెరైక్టర్లు పి.సి.మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్, డి.ఎన్.రావు, రే చౌదరి, ఇండిపెండెంట్ డెరైక్టర్లు సునీల్ గుప్తా, కె.ఎం.పద్మనాభన్, జీఎం(ఫైనాన్స్) జె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు