విశాఖ స్టీల్‌ప్లాంట్‌ టర్నోవర్‌ రూ. 12,781కోట్లు

6 Apr, 2017 00:29 IST|Sakshi
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ టర్నోవర్‌ రూ. 12,781కోట్లు

సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వరంగ సంస్థ విశాఖ స్టీల్‌ప్లాంట్‌   2016–17లో రూ. 12,781 కోట్ల టర్నోవర్‌ సాధించింది. బుధవారం ఉన్నతాధికారులుతో  జరిగిన కార్యక్రమంలో   2016–17లో సాధించిన ప్రగతి, ఉత్పత్తి, సవాళ్లను సీఎండి మధుసూదన్‌ వివరించారు.  ఆ వ్యవధిలో హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో 11 శాతం, ద్రవ ఉక్కులో 10 శాతం, ఫినిష్డ్‌ స్టీల్‌లో 16 శాతం, సేలబుల్‌ స్టీల్‌లో 10 శాతం వృద్ధి సాధించినట్టు తెలిపారు. ముఖ్యంగా రెండవ వైర్‌ రాడ్‌ మిల్‌లో ఉత్పత్తి రికార్డు స్థాయిలో 43 శాతం వృద్ధి సాధించగా, 5 శాతం వృద్ధితో సింటర్‌ ఉత్పత్తి 6 మిలియన్‌ టన్నుల మార్కును అందుకుందన్నారు.

గత ఏడాది ఐరన్‌ ఓర్, కోకింగ్‌ కోల్‌ ధరలు గణనీయంగా పెరిగినప్పటికి ఉత్పత్తి, టర్నోవర్‌లో వృద్ధి సాధించిందని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విస్తరణ యూనిట్ల నుంచి ఉత్పత్తిని పెంచడం ద్వారా ప్లాంట్‌ సామర్ధ్యం పెంచాలని ఆయన కోరారు. గత ఏడాదిలో డిజిటల్‌ పేమెంట్లు, ఈ–టెండరింగ్‌ వంటి అంశాల్లో చూపిన ప్రగతి సంస్థ అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు పి.సి.మహాపాత్ర, డి.ఎన్‌.రావు, రే చౌదరి, కె.సి.దాస్‌తో పాటు ఈడీలు, జీఎంలు, వివిధ కార్మిక సంఘాల  నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు