డాట్‌ను ఆశ్రయించిన వొడాఫోన్‌ ఐడియా

26 Feb, 2020 18:13 IST|Sakshi

ముంబై : సగటు స్ధూల రాబడి (ఏజీఆర్‌)పై ప్రభుత్వానికి బకాయిల చెల్లింపుల సంక్షోభంలో కూరుకుపోయిన వొడాఫోన్‌ ఐడియా ఊరటను కోరుతూ టెలికాం శాఖ (డాట్‌)ను ఆశ్రయించింది. తమకు రావాల్సిన రూ 8000 కోట్ల జీఎస్టీ రిఫండ్‌ను సర్దుబాటు చేయాలని కోరింది. ఏజీఆర్‌ బకాయిల చెల్లింపుల షెడ్యూల్‌ను వాయిదా వేయాలని కూడా వొడాఫోన్‌ ఐడియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. బకాయిల చెల్లింపులో ఊరట కల్పించాలని కంపెనీ చేసిన వినతిని సర్వోన్నత న్యాయస్ధానం తోసిపుచ్చడంతో వొడాఫోన్‌ ఐడియాకు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిల్లో కంపెనీ ఇప్పటికే రూ 3500 కోట్లు చెల్లించగా, స్వయం మదింపు ఆధారంగా రూ 23,000 కోట్లు ఇంకా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఇందులో రూ 7000 కోట్లు అసలు మొత్తం. మరోవైపు బకాయిల చెల్లింపునకు మూడేళ్ల మారటోరియం గడవు ఇవ్వాలని, లైసెన్స్‌ఫీజును ప్రస్తుతమున్న 8 శాతం నుంచి 3 శాతానికి తగ్గించాలని కంపెనీ డాట్‌ను కోరుతోంది. స్పెక్ర్టం వాడకం చార్జీలను సైతం 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని కోరుతోంది.

చదవండి : అలాగైతే వొడాఫోన్‌ మూతే..

>
మరిన్ని వార్తలు