వొడాఫోన్‌ ఐడియా షేరు 25 శాతం అప్‌!

29 May, 2020 10:29 IST|Sakshi

వొడాఫోన్‌ ఐడియాలో పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్‌ సిద్ధమవుతోందన్న వార్తలు వొడాఫోన్‌ ఐడియా షేరులో భారీ కొనుగోళ్లకు తెరదీశాయి. దీంతో శుక్రవారం ఈ షేరు దాదాపు 25 శాతం లాభపడింది. గురువారం రూ. 5.80 వద్ద క్లోజయిన వొడాఫోన్‌ ఐడియా షేరు శుక్రవారం రూ.6.35 వద్ద ఓపెనయింది. అనంతరం హయ్యర్‌ సర్క్యూట్స్‌ను తాకుతూ ఉదయం 10.18కి 20 శాతం లాభపడి 6.95 వద్దకు చేరి, 10.26కు 25శాతం దూసుకుపోయి రూ. 7.15 వద్ద కదలాడుతోంది. వొడాఐడియాలో దాదాపు 5 శాతం వాటా కొనేందుకు గూగుల్‌ రెడీగా ఉందని వార్తలు వచ్చాయి. ఇందుకోసం గూగుల్‌ 11కోట్ల డాలర్లు వెచ్చించనుందని తెలిసింది. రిలయన్స్‌ జియోలో వాటాలు కొనాలని తొలుత గూగుల్‌ భావించింది, కానీ ఈ డీల్‌ను ఫేస్‌బుక్‌ సొంతం చేసుకుంది. దీంతో వొడాఫోన్‌ ఐడియాలో వాటా కొనుగోలు చేయడం ద్వారా ఇండియన్‌ టెలికం రంగంలో కాలుమోపాలని గూగుల్‌ భావిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్‌ ముందువరకు సమస్యలతో అతలాకుతలం అవుతూ వస్తున్న ఇండియా టెలికం రంగం లాక్‌డౌన్‌ అనంతరం బంగారుబాతుగా మారిపోయింది. సుప్రీంకోర్టు ఏజీఆర్‌ బకాయిల తీర్పుతో ఒకదశలో వొడాఫోన్‌ ఐడియా మూతపడుతుందనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు కంపెనీలో సెప్టెంబర్‌ నాటికి వొడాఫోన్‌ మాతృసంస్థ ముందస్తు ఒప్పదం ప్రకారం రూ.265కోట్ల పెట్టుబడులు పెట్టాల్సిఉంది. ఏడాది కాలంలో ఈ షేరు దాదాపు 60 శాతం నష్టపోయింది. 

మరిన్ని వార్తలు