వోడాఫోన్‌ ఐడియా షేరులో లాభాల స్వీకరణ

9 Jun, 2020 15:19 IST|Sakshi

21.50శాతం పతనమైన షేరు

టెలికాం రంగానికి చెందిన వోడాఫోన్‌ ఐడియా షేరు మంగళవారం ట్రేడింగ్‌లో 21.50 శాతం నష్టాన్ని చవిచూసింది. సెర్చింగ్‌ సంస్థ గూగుల్‌ ఈ కంపెనీలో 5శాతం వాటాను కొనుగోలు చేయవచ్చనే వార్తలు వెలుగులోకి రావడంతో గత 10ట్రేడింగ్‌ సెషన్‌ల్లో ఈ షేరు ఏకంగా 129శాతం లాభపడింది. ఈ నేపథ్యంలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు పాల్పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. 

‘‘గతంలో నమోదైన వాల్యూయేషన్లను పరిశీలిస్తే.., కంపెనీ దివాళా తీసేందుకు ఎక్కువగా అవకాశాల ఉండేవి. కానీ ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నప్పటికీ.., కంపెనీ మనుగడ సాగించగలదని మార్కెట్ తొందరగానే గ్రహించింది. కంపెనీలో వాటా కొనుగోలుకు గూగుల్ ప్రయత్నాలు చూస్తుందనే నివేదికలతో షేరులో అప్‌మోవ్ ప్రారంభమైంది. ఈ రోజు మనం చూస్తున్నది లాభాల బుకింగ్.’’ అని పీఎంసీ ప్రభుదాస్‌ లిల్లాధర్‌ సీఈవో అజయ్‌ తెలిపారు. 

నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు రూ.12.49 వద్ద మొదలైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో ఒక దశలో షేరు 21.50శాతం నష్టపోయి రూ.9.41 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 3గంటలకు షేరు మునుపటి ముగింపు(రూ.11.99)తో పోలిస్తే 15.50శాతం నష్టంతో రూ.10.12 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.2.61, రూ.13.54గా నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు