స్పెక్ట్రంను తక్షణం కేటాయించండి: వొడాఫోన్

10 Oct, 2014 00:42 IST|Sakshi
స్పెక్ట్రంను తక్షణం కేటాయించండి: వొడాఫోన్

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన వేలంలో దక్కించుకున్న 1800 మెగాహెట్జ్ స్పెక్ట్రంను తక్షణమే కేటాయించాలని టెలికం దిగ్గజం వొడాఫోన్ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, ప్రస్తుతం ఉపయోగిస్తున్న 900 మెగాహెట్జ్ బ్యాండ్ విడ్త్ స్పెక్ట్రం గడువును కూడా ఆరు నెలల పాటు పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. కొత్త స్పెక్ట్రం కేటాయించిన తేదీ నాటి నుంచి ఈ  పొడిగింపును వర్తింపచేయాలని పేర్కొంది. ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలో తమ దగ్గరున్న స్పెక్ట్రంను వినియోగించుకునేందుకు ఇచ్చిన గడువు తీరిపోవడానికి 7 వారాలే మిగిలి ఉందని, ఈలోగా కేటాయించకపోతే ఏర్పాట్లు చేసుకోవడం కష్టమవుతుందని వొడాఫోన్ పేర్కొంది.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా టెలికం సర్కిల్స్‌లో తమ లెసైన్సుల గడువు నవంబర్‌తో ముగిసిపోనుండటం, కొత్తగా మరో బ్యాండ్‌కి మారాల్సిన పరిస్థితి నెలకొనడం మొదలైన అంశాల నేపథ్యంలో సత్వరం స్పెక్ట్రంను సమకూర్చుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ విషయంలో మరింత జాప్యం జరిగితే సర్వీసులు అందించడంలో సమస్యలు తలెత్తుతాయని, కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని ప్రభుత్వానికి తెలిపింది. దీనిపై ఈ నెల 10 లోగా స్పష్టతనివ్వాలని కోరింది. ఈ విషయమై కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో వొడాఫోన్ గ్రూప్ చీఫ్ విటోరియో కొలావో, కంపెనీ భారత విభాగం ఎండీ మార్టిన్ పీటర్స్ భేటీ కూడా అయ్యారు. ఫిబ్రవరిలో జరిగిన వేలంలో వొడాఫోన్ సహా ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్ తదితర సంస్థలు రూ. 62,162 కోట్లు వెచ్చించి స్పెక్ట్రం దక్కించుకున్నాయి. అయినా ఇప్పటిదాకా కేటాయింపులు జరగకపోవడంతో కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు