వొడాఫోన్‌ నుంచి కూడా రెండు సరికొత్త ప్లాన్లు

14 Nov, 2017 17:26 IST|Sakshi

రిలయన్స్ జియో నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ సంస్థ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు తాజాగా రెండు సరికొత్త ప్లాన్లను లాంచ్‌ చేసింది. రూ.458, రూ.509 పేరిట ఈ రెండు ప్లాన్లు తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ల కింద రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ సౌకర్యం, ఉచిత రోమింగ్‌, ఉచిత ఎస్‌ఎంఎస్‌లు లభ్యం కానున్నాయి. అయితే ఇతర ప్లాన్ల మాదిరిగా కాకుండా ఈ రెండు ప్లాన్ల వాలిడిటీ మాత్రం భిన్నంగా ఉంది. రూ.458 ప్లాన్ వాలిడిటీ 70 రోజులు ఉండగా, రూ.509 ప్లాన్ వాలిడిటీ 84 రోజులుగా ఉంది.

రూ.509 రీఛార్జ్‌ చేసుకున్న వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ యూజర్లకు అపరిమిత లోకల్‌ కాల్స్‌, రోజుకు 1జీబీ డేటా లభించనుందని కంపెనీ తెలిపింది. అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ భారత్‌లో ఏ నెంబర్‌కైనా చేసుకోవచ్చు. రోమింగ్‌కు కూడా ఇది ఉచితమే. అయితే రోజుకు గరిష్టంగా 250 నిమిషాల వరకు, వారానికి 1వేయి నిమిషాల వరకు మాత్రమే లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా వొడాఫోన్‌ ప్లే ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కూడా దీనిలో కలిసి ఉంటుంది. 1జీబీ డేటా 4జీ, 3జీ కనెక్షన్ల రెండింటికీ వర్తిసుంది. మొత్తం వాలిడిటీ ఈ ప్లాన్‌ది 84 రోజులు. అంటే 84జీబీ డేటా వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. రోజుకు 1జీబీ డేటా పరిమితి దాటిపోయిన తర్వాత బ్రౌజింగ్‌ స్పీడు పడిపోతుంది. 

ఇక రెండో ప్లాన్‌ కింద రూ.458 తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ కింద కూడా అచ్చం రూ.509 ప్లాన్‌లో అందిస్తున్న ప్రయోజనాలే అందనున్నాయి. కానీ వాలిడిటీ మాత్రమే భిన్నం. ఈ ప్లాన్‌ వాలిడిటీ 70 రోజులే. అంటే రోజుకు 1జీబీ డేటా చొప్పున మొత్తంగా వినియోగదారులకు 70జీబీ డేటా అందుబాటులో ఉండనుంది. అయితే ఈ రెండు ప్లాన్లు కూడా ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌ యూజర్లకేనని తెలిసింది. ప్యాన్‌ ఇండియా బేసిస్‌లో ఎంపిక చేసిన కస్టమర్లకు ఈ ప్లాన్లను అందించనుంది. మైవొడాఫోన్‌ యాప్‌ లేదా కస్టమర్‌ కేర్‌కు కాల్‌ చేసి ఈ ఆఫర్లు తమకు అందుబాటులో ఉన్నాయో లేదో కస్టమర్లు తెలుసుకోవాల్సి ఉంది.

ఇవే ప్లాన్లు జియోలో రూ.459, రూ.509 లకు లభిస్తున్నాయి. రూ.459 ప్లాన్‌లో రోజుకు 1జీబీ డేటా లభిస్తుండగా, రూ.509 ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ల వాలిడిటీ వరుసగా 84 రోజులు, 49 రోజులుగా ఉంది. రెండింటిలోనూ యూజర్లకు అన్‌లిమిటెల్ కాల్స్ లభిస్తాయి.

మరిన్ని వార్తలు