త్వరలో ఫోక్స్‌ వాగన్‌ ఎలక్ట్రిక్‌ కారు

10 Sep, 2019 19:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ టెల్సా తీసుకొచ్చిన మూడో మోడల్‌కు పోటీగా జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల కంపెనీ ‘ఫోక్స్‌ వ్యాగన్‌ (వీడబ్లూ)’ ఐడీ.3 మోడల్‌ పేరిట ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో సోమవారం జరిగిన మోటార్‌ షోలో ప్రదర్శించిన ఈ కారు ధర 27 వేల పౌండ్ల నుంచి 30 వేల పౌండ్ల వరకు (24. 03 లక్షల నుంచి 26.69 లక్షల రూపాయల వరకు) ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. టెల్సా మూడో మోడల్‌తోని పోలిస్తే ధర దాదాపు పది వేల డాలర్లు తక్కువగా ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ ఐడీ.3 ఎలక్ట్రిక్‌ కారు గంటకు 99 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఒకసారి చార్జిచేస్తే నిరాటంకంగా 420 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, బ్యాటరీ కూడా టెల్సా కంపెనీతో పోలిస్తే ఏడు మైళ్లు  ఎక్కువగా వస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మోడల్‌కు చెందిన మొదటి ఎడిషన్‌ కార్లను వచ్చే ఏడాది మధ్యలో ఈజిప్టులో మార్కెట్‌కు విడుదల చేస్తామని, మరో రెండు రకాల ఎడిషన్లను ఆ తర్వాత విడుదల చేస్తామని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. లాంచింగ్‌ వర్షన్‌లో 58 కిలోవాట్ల బ్యాటరీని ఉపయోగిస్తున్నామని, వెనక డిక్కీలో 368 లీటర్ల లగేజీ స్థలం ఉంటుందని ఆ వర్గాలు తెలిపాయి. బ్యాటరీ చార్జింగ్‌ కోసం 100 కిలోవాట్స్‌ ఫాస్ట్‌ చార్జర్‌లో పెడితే అరగంటలో మొత్తం కారు బ్యాటరీ చార్జ్‌ అవుతుందని, ఈ కార్‌ మోడల్‌ను మొత్తం మూడు వేరియంట్లలో 45 కిలోవాట్స్, 58 కిలోవాట్స్, 77 కిలోవాట్స్‌తో తీసుకొస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

>
మరిన్ని వార్తలు