1.9లక్షల ఫోక్స్ వాగన్ కార్లు రీకాల్

4 Jun, 2016 20:26 IST|Sakshi
1.9లక్షల ఫోక్స్ వాగన్ కార్లు రీకాల్

కర్బన ఉద్గారాల స్కాం ఎఫెక్ట్ భారత్ లో అమ్ముడుపోయిన ఫోక్స్ వాగన్ కార్లపైనా పడింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ, జర్మన్ ఆటోమేకర్ ఫోక్స్ వాగన్, భారత్ లో కూడా తన కార్లను రీకాల్ చేయనున్నట్టు ప్రకటించింది. 1.9లక్షల కార్లను ఈ ఏడాది జూలై నుంచి రీకాల్ చేస్తామని వెల్లడించింది. కర్బన ఉద్గారాల స్కామ్ ఆరోపణలు రుజువైన క్రమంలో ఫోక్స్ వాగన్ తన కార్లను రీకాల్ చేయడం ప్రారంభించింది. అయితే భారత్ లో స్వచ్ఛందంగానే తమ కార్లను రీకాల్ చేస్తున్నామని, అమెరికాలో లాగా భారత్ లో కర్బన ఉద్గారాల నిబంధనలను ఉల్లఘించినందుకు ఎలాంటి చర్యలను, ఫీజులను భరించలేదని పేర్కొంది. జూలై నుంచి రీకాల్ ప్రాసెస్ ప్రారంభించి, తర్వాత 10 నెలల వరకు కొనసాగిస్తామని ఫోక్స్ వాగన్ మార్కెటింగ్ అధినేత కమల్ బసు వెల్లడించారు.

నిబంధనలు ఉల్లఘించి మోసపూరిత కర్బన ఉద్గారాల సాప్ట్ వేర్ ను ఫిక్స్ చేసినందుకు అమెరికాలో తన కార్లను ఫోక్స్ వాగన్ రీకాల్ చేసింది. భారత్ లో కూడా ఈ సాప్ట్ వేర్ ఫిక్స్ చేసిన వాహనాలను రీకాల్ చేయనున్నామని బసు ప్రకటించారు. రీకాల్ కోసం రెగ్యులేటరీ నుంచి ఫోక్స్ వాగన్ అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ మోసపూరిత సాప్ట్ వేర్ ఉన్న దాదాపు 11 మిలియన్ డీజిల్ ఇంజన్ కార్లను యూఎస్, యూరప్, ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మినట్టు ఫోక్స్ వాగన్ ప్రకటించింది. అమెరికాలో ఈ స్కామ్ బయటపడిన తర్వాత భారత్ లో ఫోక్స్ వాగన్ అమ్మకాలు పడిపోయాయి. అమెరికాలో మార్కెట్లో ఫోక్స్ వాగన్ జరిమానాలు, క్రిమినల్ ఇన్ వెస్టిగేషన్లతో రెట్టింపు చర్యలను ఎదుర్కొంటోంది.

మరిన్ని వార్తలు