చైనా నుంచి భారత్‌కు వాన్‌వెలక్స్

20 May, 2020 02:56 IST|Sakshi

ఆరంభ పెట్టుబడి రూ.110 కోట్లు

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కల్లోలం నేపథ్యంలో చైనా నుంచి దిగ్గజ కంపెనీలు తరలిపోతున్నాయి. తాజాగా వాన్‌వెలక్స్‌ బ్రాండ్‌ పేరుతో సౌఖ్యవంతమైన పాదరక్షలు తయారు చేసే జర్మనీకి చెందిన కాసా ఎవర్జ్‌ జీఎమ్‌బీహెచ్‌ ఈ జాబితాలో చేరింది. ఏడాదికి 30 లక్షల పాదరక్షల తయారీని ఈ కంపెనీ చైనా నుంచి భారత్‌కు తరలిస్తోంది. ఆరంభంలో ఈ కంపెనీ రూ.110 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నదని లాట్రిక్‌ ఇండస్ట్రీస్‌ డైరెక్టర్, సీఈఓ ఆశీష్‌ జైన్‌ పేర్కొన్నారు. వాన్‌వెలక్స్‌ బ్రాండ్‌కు భారత్‌లో లైసెన్సీ సంస్థగా లాట్రిక్‌ ఇండస్ట్రీస్‌ వ్యవహరిస్తోంది. లాట్రిక్‌ సంస్థ ఏడాదికి 10 లక్షల పాదరక్షలను కాసా ఎవర్జ్‌కు తయారు చేస్తోంది.  

రెండేళ్లలో ఏర్పాటు...: ఏడాదికి 30 లక్షలకు పైగా పాదరక్షలు ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వ  సహకారంతో రెండేళ్లలో ఏర్పాటు చేయనున్నామని ఆశీష్‌ జైన్‌ వెల్లడించారు. పాదరక్షల తయారీలో కార్మికులు, ముడి పదార్థాలు కీలకమన్నారు. ఈ రెండు అంశాల్లో భారత్‌ ఆకర్షణీయంగా ఉండటంతో చైనా నుంచి భారత్‌కు తన ప్లాంట్‌ను కాసా ఎవర్జ్‌ కంపెనీ తరలిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో భారత్‌ భవిష్యత్‌ తయారీ కేంద్రంగా అవతరించనున్నదని వ్యాఖ్యానించారు.  

80 దేశాల్లో విక్రయాలు...: కాసా ఎవర్జ్‌ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా  18 ప్లాంట్లు ఉన్నాయి. 12 లైసెన్సీ సంస్థలతో 80 దేశాల్లో విక్రయాలు జరుపుతోంది. భారత్‌లో 2019లో ఈ బ్రాండ్‌ పాదరక్షల విక్రయాలు మొదలయ్యాయి. 

మరిన్ని వార్తలు