బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌ ‘రింగ్‌’

7 Nov, 2019 12:02 IST|Sakshi

50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు వర్తింపు

80,000 మంది దాకా వినియోగించుకుంటారని అంచనా

డిసెంబర్‌ 3 దాకా అవకాశం

సంస్థకు రూ. 7,000 కోట్ల ఆదా బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ పి.కె. పుర్వార్‌

న్యూఢిల్లీ: కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్‌ఎస్‌) ప్రకటించింది. నవంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 3 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. సుమారు 70,000–80,000 మంది దాకా ఉద్యోగులు దీన్ని వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ చైర్మన్‌ పి.కె. పుర్వార్‌ తెలిపారు. దీనితో వేతనాల బిల్లు భారం దాదాపు రూ. 7,000 కోట్ల దాకా తగ్గగలదని ఆయన చెప్పారు. వీఆర్‌ఎస్‌ గురించి ఉద్యోగులకు తెలియజేయాలంటూ క్షేత్రస్థాయి యూనిట్లకు ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో మొత్తం 1.5 లక్షల మంది ఉద్యోగులు ఉండగా .. దాదాపు ఒక లక్ష మందికి వీఆర్‌ఎస్‌ వినియోగించుకునే అర్హత ఉంటుంది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్‌ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్‌ఎల్‌ ఇప్పటికే తమ ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. 

వీఆర్‌ఎస్‌ పథకం ఇలా...
‘బీఎస్‌ఎన్‌ఎల్‌ స్వచ్ఛంద విరమణ పథకం – 2019’ ప్రకారం పర్మనెంట్‌ ఉద్యోగులతో పాటు ఇతర సంస్థలకు డిప్యుటేషన్‌పై వెళ్లిన వారికి కూడా వీఆర్‌ఎస్‌ వర్తిస్తుంది. 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకు దీన్ని వర్తింపచేస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ వెల్లడించింది. సర్వీసు పూర్తయిన ప్రతి సంవత్సరానికి 35 రోజుల వేతనం, సూపర్‌యాన్యుయేషన్‌ దాకా మిగిలిన సర్వీసుకు సంబంధించి ప్రతి ఏడాదికి 25 రోజుల వేతనం చొప్పున చెల్లించనుంది.

మరిన్ని వార్తలు