లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

13 Jun, 2020 10:47 IST|Sakshi

సూచీలకు అండగా నిలిచిన టెక్నాలజీ, ఫైనాన్స్‌ షేర్ల ర్యాలీ 

ట్రేడింగ్‌ ఆద‍్యంతం ఒడిదుడుకులే...

ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన అమెరికా సూచీలు చివరికి 1శాతం లాభంతో ముగిశాయి. డోజోన్స్‌ ఇండెక్స్‌  477 పాయింట్ల లాభంతో 25,605 వద్ద, ఎస్‌అండ్‌పీ సూచీ 39 పాయింట్లు పెరిగి 3,041 వద్ద, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 96 పాయింట్లు ర్యాలీ చేసి 9,588 వద్ద స్థిరపడ్డాయి. ఫైనాన్స్‌, టెక్నాలజీ రంగాలకు చెందిన షేర్ల ర్యాలీ సూచీలకు అండగా నిలిచింది. 

వారం మొత్తం మీద డోజోన్స్‌ ఇండెక్స్‌ 5.5శాతం, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 5శాతం, నాస్‌డాక్‌ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయాయి. మార్చి 20వ తేదితో ముగిసిన తర్వాత సూచీలు అత్యధిక నష్టాలను మూటగట్టుకుంది ఇదే వారంలో కావడం గమనార్హం. ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యపాలసీ సమావేశం గురువారం జరిగింది. సమావేశం అనంతరం ఛైర్మన్‌ పావెల్‌ మాట్లాడుతూ పెరుగుతున్న కోవిడ్‌-19 కేసులు ఆర్థికవ్యవస్థను మందగమనం వైపు నడిపిస్తున్నాయని, రికవరీకి మరింత ఎక్కువ సమయం పడుతుందన్నారు. దీంతో అదే రోజున సూచీలు 6-7శాతం నష్టాలను చవిచూశాయి. 

అంచనాలకు మించి త్రైమాసిక ఫలితాలను ప్రకటించడంతో పోటోషాప్‌ మేకర్‌ అడోబ్ ఇంక్ 5శాతం లాభంతో ముగిసింది. ఇదే మార్చి క్వార్టర్‌ ఫలితాలను అందుకోవడంలో విఫలమైన యోగా దుస్తుల తయారీ సంస్థ లులులేమోన్ అథ్లెటికా ఇంక్ 4శాతం నష్టాన్ని చవిచూసింది. 

భారీ లాభాల్లో ముగిసిన ఏడీఆర్‌లు: 
అమెరికా మార్కెట్ల లాభాల ముగింపు నేపథ్యంలో అక్కడి మార్కెట్లో ట్రేడయ్యే భారత ఏడీఆర్‌లు భారీ ర్యాలీ చేశాయి. అత్యధికంగా టాటా మోటర్స్‌ ఏడీఆర్‌ దాదాపు 7శాతం లాభపడింది. హెచ్‌డీఎఫ్‌సీ ఏడీఆర్‌, ఐసీఐసీఐ ఏడీఆర్‌లు 4శాతం, విప్రో ఏడీఆర్‌ 1శాతం లాభంతో ముగిశాయి. అయితే డాక్టర్‌ రెడ్డీస్‌ ఏడీఆర్‌ మాత్రం స్వల్పంగా 0.25శాతం నష్టంతో ముగిసింది. 

మరిన్ని వార్తలు