తెలుగు రాష్ట్రాల్లో వాల్‌మార్ట్‌ విస్తరణ

28 Mar, 2017 01:44 IST|Sakshi
తెలుగు రాష్ట్రాల్లో వాల్‌మార్ట్‌ విస్తరణ

రెండు రాష్ట్రాల్లో 10 స్టోర్ల చొప్పున ఏర్పాటు
దేశవ్యాప్తంగా కొత్తగా 50 దుకాణాలు  


న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రిటైల్‌ దుకాణాల్లో అగ్రగామిగా ఉన్న వాల్‌మార్ట్‌ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా విస్తరించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 10 స్టోర్ల చొప్పున కొత్తగా 20 దుకాణాలను ఏర్పాటు చేయనుంది. అలాగే, మహారాష్ట్రలోనూ 10 స్టోర్లను ప్రారంభించనుంది. ప్రస్తుతం వాల్‌ మార్ట్‌ ఇండియా క్యాష్‌ అండ్‌ క్యారీ విభాగంలో (హోల్‌సేల్‌) దేశవ్యాప్తంగా 20 స్టోర్లను నిర్వహిస్తోంది. వీటి సంఖ్యను గణనీయంగా పెంచే ప్రణాళికలతో ఉంది. దేశవ్యాప్తంగా 50 దుకాణాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్న ఈ సంస్థ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో గణనీయ సంఖ్యలో ఏర్పాటు చేయాలని చూస్తోంది.

ప్రభుత్వం నిబంధనలను సరళీకరిస్తే ఫుడ్‌ రిటైల్‌లోకీ అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలియజేశాయి. భారతీ గ్రూపుతో రిటైల్‌ భాగస్వామ్యానికి కొన్నేళ్ల క్రితం ముగింపు పలికిన వాల్‌మార్ట్‌ అప్పటి నుంచి సొంతంగా దుకాణాల ఏర్పాటుపై దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఇతర సంస్థల నుంచి క్యాష్‌ అండ్‌ క్యారీ విభాగంలో పోటీ తక్కువగా ఉండడంతో అధిక అవకాశాలున్నాయని భావిస్తున్న యూపీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. వాల్‌మార్ట్‌ నిర్వహిస్తున్న స్టోర్లన్నీ హల్‌సేల్‌ విభాగంలోనివే. అంటే రిటైల్‌ దుకాణాదారులు, క్యాంటీన్లు, హోటళ్ల వారు ఈ స్టోర్లలో కొనుగోలు చేసేందుకు వీలుంటుంది.

ఫుడ్‌ రిటైల్‌లోకీ అడుగు!
ఇక ఫుడ్‌ రిటైల్‌పైనా కంపెనీ ఆసక్తితో ఉంది. ఈ విషయంలో మార్గదర్శకాల పరంగా స్పష్టత కోసం వేచి చూస్తోంది. ఫుడ్‌ రిటైల్‌లోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం సానుకూల నిర్ణయమని, అయితే, ఆహారేతర ఉత్పాదనలను కూడా విక్రయించే వెసులుబాటు కల్పిస్తే ఆర్థికంగా గిట్టుబాటవుతుందని వాల్‌మార్ట్‌ ఇండియా కంపెనీ ప్రతినిధి తెలిపారు. ‘‘భారత్‌లో కార్యకలాపాలను విస్తరించనున్నాం. వచ్చే కొన్నేళ్లలో ఏపీ, తెలంగాణ, యూపీ, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్రలో కొత్తగా 50 దుకాణాలను ప్రారంభించనున్నాం. మా బృందం ఇప్పటికే ఈ దిశగా కార్యాచరణ ప్రారంభించింది. కిరాణా దుకాణాలు, చిన్న, మధ్య స్థాయి సరఫరాదారులకు సాయం అందించేందుకు, వేలాది ఉద్యోగాల కల్పనకు మేము కట్టుబడి ఉన్నాం’’ అని వాల్‌మార్ట్‌ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు