వాల్‌మార్ట్‌ కొత్త స్టోర్లు వచ్చేస్తున్నాయ్‌..

2 Dec, 2017 09:25 IST|Sakshi

అమెరికా బహుళ జాతీయ రిటైల్‌ కార్పొరేషన్‌ వాల్‌మార్ట్‌ భారత్‌లో మరిన్ని కొత్త స్టోర్లను ఏర్పాటుచేయబోతుంది. భారత్‌లో ఏర్పాటుచేసే కొత్త స్టోర్ల కోసం 21 సైట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వాల్‌మార్ట్‌ ఇండియా ప్రకటించింది. ఈ సైట్లలో ఏర్పాటుచేయబోయే కొత్త స్టోర్లను వచ్చే ఏడాది ప్రారంభించబోతున్నట్టు వాల్‌మార్ట్‌ ఇండియా అధికారికంగా తెలిపింది. ప్రస్తుతం భారత్‌లో తొమ్మిది రాష్ట్రాల్లో 21 ఉత్తమమైన ధరల హోల్‌సేల్‌ స్టోర్లను కంపెనీ నడుపుతోంది. ఇప్పటికే కొత్త ప్రాజెక్టుల కోసం వాల్‌మార్ట్‌ పనిచేయడం కసరత్తులు ప్రారంభించిందని తెలిసింది. తమ నిబద్ధత, లక్ష్యాలను చేరుకోవడానికి సుమారు 20 సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు వాల్‌మార్ట్‌ ఇండియా అధ్యక్షుడు, సీఈవో క్రిష్‌ అయ్యర్‌ చెప్పారు.

2020 నాటికి 50 కొత్త స్లోర్లను ఏర్పాటుచేసి, మొత్తం స్టోర్ల సంఖ్యను 70కి పెంచుకోవాలని వాల్‌మార్ట్‌ ఇండియా చూస్తోంది.  వాల్‌మార్ట్‌ స్టోర్స్‌ ఇంక్‌ ఆధ్వర్యంలో నడిచే వాల్‌మార్ట్‌ ఇండియా మొత్తం 5000 రకాల ఉత్పత్తులను అందిస్తోంది. నగదు, హోల్‌సేల్‌ ఫార్మాట్‌లో ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ ఏడాది మే నెలలో వాల్‌మార్ట్‌ సంస్థ తెలంగాణలో పది కొత్త దుకాణాలను ఏర్పాటుచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోను ఘరానా 'చిల్లర' దుకాణాలను నడిపిస్తున్న 'వాల్‌మార్ట్' అతి పెద్ద అంతర్జాతీయ 'కిరాణా దుకాణాల సమాఖ్య' గా పేరు మోసింది.

మరిన్ని వార్తలు