విస్తరణ బాటలో వాల్‌మార్ట్‌

24 Jul, 2018 00:42 IST|Sakshi

వచ్చే 3 ఏళ్లలో మరో 20 స్టోర్లు

దేశంలో ఇప్పటికే ఉన్న బెస్ట్‌ప్రైస్‌ స్టోర్ల సంఖ్య 21

రెండవ ఎఫ్‌సీ సెంటర్‌ ప్రారంభం

లక్నో: ఆన్‌లైన్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న అమెరికా రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌... తన స్టోర్లను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. వచ్చే మూడేళ్లలో మరో 20 హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్లను భారత్‌లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. సోమవారం లక్నోలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సంస్థ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్‌ అయ్యర్‌ ఈ విషయం చెప్పారు.

ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాలను పెంచడం ద్వారా ఆన్‌లైన్‌ బిజినెస్‌–టూ–బిజినెస్‌ (బీటూబీ) కస్టమర్లకు విస్తృత సేవలందించే అవకాశం లభిస్తుందన్నారు. వేగంగా పెరుగుతున్న ఈ–కామర్స్‌ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ‘ఈ ఏడాదిలో రెండు, వచ్చే ఏడాదిలో 8, ఆ తరువాత ఏడాదిలో 10 స్టోర్లను ప్రారంభించడం ద్వారా వచ్చే మూడేళ్లలో మరో 20 స్టోర్లను భారత్‌లో ప్రారంభిస్తాం. వచ్చే ఐదు నుంచి ఏడేళ్లలో 50 స్టోర్లను ప్రారంభిస్తాం.

’బెస్ట్‌ప్రైస్‌’ పేరుతో ఇప్పటికే భారత్‌లోని తొమ్మిది రాష్ట్రాలలో 21 క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్లున్నాయి. రానున్న కాలంలో 15 స్టోర్ల ఏర్పాటుకు యూపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదిరింది. తాజా ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా 1,500 మందికి ఉద్యోగాలొచ్చాయి. పరోక్షంగా ఎస్‌ఎంఈ సప్లయర్లకు ప్రయోజనం చేకూరుతుంది. వాల్‌మార్ట్‌ ఇండియా వ్యాపారంలో సగం వరకు స్టోర్‌ రహిత, అవుట్‌ ఆఫ్‌ స్టోర్‌ అమ్మకాల ద్వారా జరుగుతుంది.‘ అని వివరించారు. 

మరిన్ని వార్తలు