టాప్‌లోకి వాల్‌మార్ట్‌

3 Aug, 2019 19:18 IST|Sakshi

 ఫ్లిప్‌కార్ట్‌ ఎఫెక్ట్‌ , టాప్‌లోకి దూసుకొచ్చిన వాల్‌మార్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ : దేశీయ రీటైల్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకున్న అమెరికా రీటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ దేశంలో టాప్‌లోకి దూసుకొచ్చింది. ఇండియాలో అగ్రశ్రేణి రీటైలర్‌గా నిలిచింది. యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ఆసియా అధ్యయనం ప్రకారం వాల్‌మార్ట్ 2018లో భారతదేశంలో రీటైల్‌ వ్యాపార ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉంది. గత ఏడాది 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు అనంతరం వాల్మార్ట్‌ ఈ ఘనతను సాధించడం విశేషం. మరో యుఎస్ దిగ్గజం ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ రెండవ స్థానంలో నిలవగా, కిషోర్‌ బియానీ ఫ్యూచర్‌ గ్రూపు 3, రిలయన్స్‌ గ్రూపు 4 వ స్థానాన్ని దక్కించుకున్నాయి. టాప్-100 రిటైలర్స్‌ ఇన్‌ ఆసియా-2019 పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది.

వెస్ట్‌సైడ్, క్రోమా వంటి ఫార్మాట్లను నడుపుతున్న టాటా గ్రూప్ ఐదవ స్థానంలో ఉంది. అయితే గతంతో పోలిస్తే వీటి ర్యాంకింగ్స్‌లో ఎటువంటి మార్పు లేదు. భారతదేశపు మొదటి పది ర్యాంకింగ్స్‌లో వన్ 97 కమ్యూనికేషన్స్, డి-మార్ట్‌ను నడిపే అవెన్యూ సూపర్‌మార్ట్స్; ఆదిత్య బిర్లా గ్రూప్, ల్యాండ్‌మార్క్ గ్రూప్,  కె రహేజా కార్ప్ నిలిచాయి.  ఆసియా అంతటా, చైనా బిలియనీర్ జాక్‌మా ఆధ్వర్యంలోని అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్‌ లిమిటెడ్ టాప్‌లో నిలవగా, జెడి.కామ్ ఇంక్, జపాన్‌కు చెందిన సెవెన్ అండ్ సెవెన్ ఐ హోల్డింగ్స్  కంపెనీ లిమిటెడ్ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి.

ఖచ్చితంగా చెప్పాలంటే, భారతదేశం ఇప్పటికీ పెద్ద సాంప్రదాయ రిటైల్ మార్కెట్‌గా నిలుస్తుందనీ, కానీ పట్టణ ప్రాంతాల్లోని  కొనుగోలుదారులు మరింత అధునాతనమవుతున్నారని యూరోమోనిటర్ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. గత దశాబ్దంలో వారి నెలవారీ షాపింగ్‌ కోసం పెద్ద పెద్ద షాపింగ్‌మాల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. మారుతున్న జీవన శైలి, బిజీ షెడ్యూల్ కారణంగా, పట్టణ ప్రాంతాల్లోని చాలామంది వినియోగదారులు సాంప్రదాయ కిరాణా రిటైలర్లకు బదులుగా ఆధునిక కిరాణా రిటైలర్లలో నెలవారీ కొనుగోళ్లు చేయడానికి ఇష్టపడతారని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా బెంగుళూరు, ముంబై, పూణే, ఢిల్లీ,  హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లోఈ మార్పులు చోటుచేసుకున్నాయని  తేల్చింది.

అంతేకాదు ఆధునిక కిరాణా చిల్లర వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించడానికి కొత్త మార్కెటింగ్ పథకాలు, వ్యూహాలతో వ్యాపారశైలిని ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నారని చెప్పింది.  డిజిటల్ చెల్లింపులు, అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ షాపింగ్‌ లాంటి అవకాశాలతో ఆధునిక రిటైల్ ఫార్మాట్‌లకు భారతదేశంలో ప్రజాదరణ లభిస్తోందని తెలిపింది. 

మరిన్ని వార్తలు