ఫ్లిప్‌కార్ట్‌ డీల్‌.. భారత్‌కు మేలే

11 May, 2018 00:45 IST|Sakshi

లక్షలాది ఉద్యోగాలు వస్తాయి

స్థానికంగానే సరుకుల కొనుగోలు

ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం

నియంత్రణ సంస్థల ఆమోదానికి సమస్య ఉండదు...

వాల్‌మార్ట్‌ సీఈవో మెక్‌ మిలన్‌

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌– వాల్‌మార్ట్‌ మధ్య కుదిరిన ఒప్పందం భారత్‌కు మేలు చేస్తుందని వాల్‌మార్ట్‌ సీఈవో డగ్‌ మెక్‌మిలన్‌ చెప్పారు. కొంత కాలంలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్నారు. స్థానికంగా సరుకులను సమీకరించడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు మేలు కలుగుతుందన్నారు. 16 బిలియన్‌ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో 77 శాతం వాటా కొనుగోలు చేస్తున్నట్టు వాల్‌మార్ట్‌ బుధవారం ప్రకటించగా, అనంతరం ప్రధాని మోదీ, ఇతర సీనియర్‌ మంత్రులను కలవకపోవడానికి పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. అధికారులతో తాను డీల్‌కు ముందు సమావేశమయ్యాయని, భవిష్యత్తులో మళ్లీ భేటీ అవుతానని మెక్‌మిలన్‌ చెప్పారు. భారత్‌కు వాల్‌మార్ట్‌ కొత్తగా రాలేదని గుర్తు చేశారు. బుధవారం ఈ డీల్‌పై ప్రకటన అనంతరం, వాల్‌మార్ట్‌ నిబంధనలను తుంగలో తొక్కి దొడ్డిదారిన భారత్‌లోకి వస్తోందని, జాతి ప్రయోజనాల దృష్ట్యా ప్రధాని ఇందులో జోక్యం చేసుకోవాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ డిమాండ్‌ చేయడం తెలిసిందే. ‘‘ఈ డీల్‌ కస్టమర్లకు మంచిది. ఉద్యోగాల కల్పన ద్వారా సమాజానికి మంచి చేస్తుంది’’ అని మీడియా రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మెక్‌మిలన్‌ చెప్పారు. ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలుకు నియంత్రణ సంస్థల అనుమతులు పొందడంలో ఎటువంటి సమస్య ఉండకపోవచ్చన్నారు.

ఉపాధి అవకాశాలు పెరుగుతాయి
ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేయడం వల్ల ఎన్ని ఉద్యోగాలు వస్తాయనే దానిపై కచ్చితమైన గణాంకాలు చెప్పడం కష్టమని మెక్‌మిలన్‌ వ్యాఖ్యానించారు. లక్షలాది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు వస్తాయంటూ థర్డ్‌ పార్టీ పరిశోధన వివరాలను ప్రస్తావించారు. ‘‘కొంత కాలానికి మరో కోటి ఉద్యోగాలు వస్తాయి. అయితే, ఇందుకు కచ్చితమైన సమయం చెప్పలేను’’ అన్నారు. కంపెనీలోనే కాకుండా ఫ్లిప్‌కార్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై విక్రయదారుల వైపు ఉద్యోగాలు ఏర్పడతాయన్నారు. వాల్‌మార్ట్‌ కార్యకలాపాలు నిర్వహించే దేశాల్లో 90 శాతం సరుకులను స్థానికంగానే కొనుగోలు చేస్తున్నదనే విషయాన్ని గుర్తించాల్సి ఉందన్నారు.  ఫ్లిప్‌కార్ట్‌ ప్రత్యేకంగా బోర్డు ఆధ్వర్యంలోని కంపెనీగానే కొనసాగుతుందని, వాల్‌మార్ట్‌ కేవలం రిసోర్స్‌ సెంటర్‌గా పనిచేస్తుందని, సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ సీఈవోగా వ్యవహరిస్తారని వివరించారు.

మరో 50 వాల్‌మార్ట్‌ స్టోర్లు 
వచ్చే 4–5 ఏళ్లలో భారత్‌లో కొత్తగా 50 స్టోర్లను ఏర్పాటు చేస్తామని వాల్‌మార్ట్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో క్రిష్‌ అయ్యర్‌ తెలిపారు. హోల్‌సేల్‌ క్యాష్‌ అండ్‌ క్యారీ వ్యాపార విస్తరణను కొనసాగిస్తామన్నారు. ఈ ఏడాది 5 స్టోర్లను ప్రారంభిస్తామని, ఆ తర్వాత నుంచి ఏటా 12–15 స్టోర్లు కొత్తగా తెరుస్తామని అయ్యర్‌ తెలిపారు. ప్రస్తుతం బెస్ట్‌ప్రైస్‌ పేరుతో 9 రాష్ట్రాల్లోని 19 పట్టణాల్లో 21 క్యాష్‌ అండ్‌ క్యారీ స్టోర్లను వాల్‌మార్ట్‌  నిర్వహిస్తోంది. తాము ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లోనే కొనసాగుతామని, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు. బెస్ట్‌ప్రైస్‌ స్టోర్లను ఫ్లిప్‌కార్ట్‌పై జరిపే విక్రయాలకు పికప్, డెలివరీ సెంటర్లుగా వాల్‌మార్ట్‌ వినియోగించుకోవచ్చని భావిస్తున్నారు.

సచిన్‌ ఫ్లిప్‌కార్ట్‌ను వీడడం బాధాకరం: బిన్నీ 
న్యూఢిల్లీ: ఇద్దరూ కలసి 11 ఏళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్‌ పేరుతో స్టార్టప్‌ను ప్రారంభించి దేశీయ దిగ్గజ ఈ కామర్స్‌ సంస్థగా తీర్చిదిద్దిన తర్వాత అందులో ఒకరు బయటకు వెళ్లిపోనుండడం నిజంగా మరొకరిని బాధించే విషయమే. ఫ్లిప్‌కార్ట్‌ను కొనుగోలు చేసేందుకు వాల్‌మార్ట్‌ ఒప్పందం కుదుర్చుకోగా, కంపెనీ సహ వ్యవస్థాపకుల్లోఒకరైన సచిన్‌బన్సల్‌ (36) తనకున్న 5.5 శాతం వాటాను పూర్తిగా అమ్మేసి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకోగా... మరో సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ కంపెనీతోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారంనాటి మీడియా సమావేశంలో బిన్నీ బన్సల్‌ స్పందించారు. సచిన్‌ నిర్ణయాన్ని భావోద్వేగంతో కూడిన క్షణంగా అభివర్ణించారు. పేరులో బన్సల్‌ పోలిక ఉన్నప్పటికీ ఢిల్లీ ఐఐటీలో కోర్సు పూర్తి చేసేంత వరకు వీరిలో ఒకరి గురించి మరొకరికి తెలియదు. 2005లో ఐఐటీ పూర్తి చేసుకున్న తర్వాత బెంగళూరుకు మకాం మార్చి తొలుత అమేజాన్‌లో ఎనిమిది నెలల పాటు పనిచేశారు. ఆ తర్వాత 2007లో రూ.4 లక్షల పెట్టుబడితో ఫ్లిప్‌కార్ట్‌ను ఆన్‌లైన్‌ పుస్తక విక్రయ వేదికగా ఏర్పాటు చేశారు. అనంతరం సమగ్ర ఈ కామర్స్‌ కంపెనీగా తీర్చిదిద్దారు. ‘‘సచిన్‌ నేను చాలా కాలం పాటు కలసి ప్రయాణించాం. ఐఐటీ ఢిల్లీ పాసింగ్‌ అవుట్‌ సందర్భంగా 2005లో కలుసుకున్నాం. తర్వాత ఇద్దరం బెంగళూరుకు వెళ్లాం. మేమంతా ఐఐటీ, ఢిల్లీకి చెందిన 8 మంది స్నేహితుల బృందం. మంచి స్నేహితులుగా ఉన్నాం. మా ఇద్దరిలో ఒకరు మరొకరికి మద్దతుగా నిలిచిన వారమే’’ అని బిన్నీ బన్సల్‌ వివరించారు. సచిన్‌ భవిష్యత్తు ప్రయత్నాలకు మంచి జరగాలని ఆశిస్తున్నట్టు చెప్పారు.
 
రోజూ 40–50 కిలోమీటర్ల ప్రయాణం 
‘‘వ్యాపారం కోసం చేయాల్సినవన్నీ చేశాం. సచిన్, నేను బెంగళూరు సిటీలో బైక్‌పై రోజూ 40–50 కిలోమీటర్లు తిరుగుతూ పలువురు డిస్ట్రిబ్యూటర్ల వద్ద పుస్తకాలను సమీకరించి, వాటిని ప్యాక్‌ చేసి కస్టమర్లకు పంపేవాళ్లం. పదేళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే మేం ఎలా ప్రారంభించాం, ఏం చేశామన్నది తలచుకుంటే అద్భుతంగా ఉంది’’ అని బిన్నీ తమ వ్యాపార అనుభవాలను వివరించారు.

వ్యక్తిగత ప్రాజెక్టులను పూర్తి చేయాల్సి ఉంది: సచిన్‌
ఫ్లిప్‌కార్ట్‌ నుంచి బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న సహ వ్యవస్థాపకుడు సచిన్‌ బన్సల్‌ తన అభిప్రాయాలతో ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ పెట్టారు. గేమింగ్‌పై పట్టు సాధించాలని, కోడింగ్‌ నైపుణ్యాలకు పదును పెట్టుకోవాల్సి ఉందన్నారు. నిలిచిపోయి ఉన్న తన వ్యక్తిగత ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెడతానని చెప్పారు. ఇంత వరకు వాటికి సమయం చిక్కలేదన్నారు. ‘‘విచారకరం ఏమిటంటే నా పని ఇక్కడ పూర్తయింది. పదేళ్ల తర్వాత దండాన్ని స్వాధీనం చేసి ఫ్లిప్‌కార్ట్‌ నుంచి బయటకు వెళ్లాల్సిన సమయం ఇది’’అని తన పోస్టింగ్‌లో సచిన్‌ పేర్కొన్నారు. బయటి నుంచి తన ప్రోత్సాహం ఉంటుందని పేర్కొంటూ, ఫ్లిప్‌కార్ట్‌ బృందం తమ ప్రస్థానాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఎన్నో పెద్ద సవాళ్లను స్వీకరించి, దేశం కోసం ఎన్నో క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం చూపించామని పేర్కొన్నారు.   

దేశీయ రిటైల్‌ రంగాన్ని దెబ్బతీస్తుంది: సీఏఐటీ
ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్‌ కొనుగోలు చేయడం దేశీయ రిటైల్‌ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, సదరు ఒప్పందాన్ని అన్ని కోణాల్లోంచి పరిశీలించాలని వర్తకుల సంఘం సీఏఐటీ డిమాండ్‌ చేసింది. ‘‘ప్రభుత్వం నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి. సదరు సంస్థ వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందాన్ని పోటీతత్వం, సైబర్‌ భద్రత, దోపిడీ ధరలు, భారీ తగ్గింపులు, నష్టాలకు ఫండింగ్‌ తదితర కోణాల్లోంచి పరీక్షించాలి’’ అని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌ ఖండేల్‌వాల్‌ కోరారు. ఒప్పందాన్ని పరిశీలించిన మీదట ప్రభుత్వం దృష్టికి లేదా కాంపిటిషన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళతామని లేదా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.
దొడ్డిదారిలో కైవసం చేసుకోవటమే: సీపీఎం వాల్‌మార్ట్‌–ఫ్లిప్‌కార్ట్‌ ఒప్పందాన్ని సీపీఎం వ్యతిరేకించింది. ఈ కోనుగోలును వేల కోట్ల రూపాయల భారత రిటైల్‌ రంగాన్ని విదేశీ నిధులతో దొడ్డిదారిలో కైవసం చేసుకోవడంగా ఆ పార్టీ అభివర్ణించింది. 

మరిన్ని వార్తలు