నోట్ల రద్దు వద్దని అప్పుడే చెప్పా...

4 Sep, 2017 01:17 IST|Sakshi
నోట్ల రద్దు వద్దని అప్పుడే చెప్పా...

ప్రత్యామ్నాయాలనూ వివరించా..
ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌


న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్‌) వల్ల స్వల్ప కాలంలో ఎదురయ్యే ఖర్చులు దీర్ఘకాలంలో వచ్చే ప్రయోజనాలకంటే ఎక్కువగా ఉంటాయని తాను కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే హెచ్చరించినట్టు రఘురామ్‌ రాజన్‌ తెలిపారు. ‘‘నా హయాంలో ఏ సందర్భంలోనూ డీమోనిటైజేషన్‌పై నిర్ణయం తీసుకోవాలని కేంద్రం కోరలేదు. డీమోనిటైజేషన్‌పై 2016 ఫిబ్రవరిలోనే ప్రభుత్వం నా అభిప్రాయాలను అడిగింది. దీంతో నేను మౌఖిక రూపంలో తెలియజేశాను. ప్రభుత్వ తన లక్ష్యాలను చేరుకునేందుకు డీమోనిటైజేషన్‌కు ప్రత్యామ్నాయాల గురించి కూడా వివరించాను’’ అని రాజన్‌ స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం ఓ నివేదిక కోరగా ఆర్‌బీఐ రూపొందించి సమర్పించిందని, ఇందులో తన పాత్ర లేదని, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌(కరెన్సీ ఇన్‌చార్జ్‌) ప్రాతి నిధ్యం వహించినట్టు తెలిపారు. ‘‘ఐ డు వాట్‌ ఐ డు: ఆన్‌ రీఫార్మ్స్, రెటోరిక్‌ అండ్‌ రీసాల్వ్‌’’ పేరుతో రాసిన పుస్తకంలో రాజన్‌ ఈ విషయాలను ప్రస్తావిం చారు. ఈ పుస్తకం వచ్చే వారం విడుదల కానుంది.

‘‘డీమోనిటైజేషన్‌కు సంబంధించి భారీ వ్యయాలు ఒక అంశం. జీడీపీ తగ్గుముఖం పట్డడం మరొకటి. ఈ ప్రభావం జీడీపీలో 1–2%గా (దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు)అంచనాలు చెబుతున్నాయి. ప్రజలు బ్యాంకుల ముందు వెచ్చించిన సమయం, ఆర్‌బీఐ నోట్ల ముద్రణకు అయిన రూ.8,000 కోట్లు, నగదును వెనక్కి తీసుకునేందుకు బ్యాంకులకు అయిన వ్యయం,  ఉద్యోగులు వెచ్చించిన  సమయం, బ్యాంకుల్లోకి వచ్చిన డిపాజిట్లపై వడ్డీ చెల్లింపులు ఇవన్నీ  చూడాలి. 99% నగదు డిపాజిట్‌ అయినందున ప్రభుత్వ లక్ష్యం నెరవేరనట్టే.

 అయితే ప్రభుత్వం ఈ డిపాజిట్లపై దర్యాప్తు చేయించగలిగితే కొన్ని నల్లధనంగా బయటపడొచ్చు. ఇందుకు ఎంతో కృషి కావాలి. డీమోనిటైజేషన్‌ వల్ల ఎలక్ట్రానిక్‌ లావాదేవీలు పెరిగిపోయాయి. ఇది ఆర్థికవ్యవస్థకు మేలే. మరో అంశం పన్ను ఆదాయం పెరగడం. ఇది రూ.10,000 కోట్లుగా ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే, ఇది డీమోనిటైజేషన్‌ వల్లనా లేక సహజంగా పెరిగిందా అన్నది స్పష్టత లేదు. డీమోనిటైజేషన్‌ ఉద్దేశం మంచిదే. కానీ ఆర్థికంగా ఇది విజయం సాధించిందని ఇప్పుడు ఎవరూ చెప్పలేరు. కాలమే సమాధానం చెబుతుంది’’ అని రాజన్‌ పేర్కొన్నారు.

బ్యాంకుల ప్రక్షాళనకు ముందు నుంచే వృద్ధి క్షీణత
ఆర్థిక వృద్ధి తగ్గుముఖం పట్టడానికి ప్రభుత్వరంగ బ్యాంకులు తమ ఖాతాల్లోని మొండి బకాయిలను(ఎన్‌పీఏ) ప్రక్షాళించే చర్యలు చేపట్టడం కారణం కాదని రాజన్‌ పేర్కొన్నారు. వృద్ధి క్షీణత అన్నది బ్యాంకు ఖాతాల ప్రక్షాళనకు ముందు నుంచే మొదలైందని  స్పష్టం చేశారు. ‘‘మొండి బకాయిల ప్రక్షాళన చర్యల వల్ల ప్రభుత్వరంగ బ్యాంకుల రుణాల వృద్ధి తగ్గుముఖం పట్టిందని  విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, వీరు గణాంకాలను ఓ సారి పరిశీలించాలి.

బ్యాంకు ఖాతాల ప్రక్షాళన చేపట్టడానికి ముందు నుంచే వృద్ధి తగ్గుముఖం మొదలైందని తెలుస్తుంది’’ అని రాజన్‌ పేర్కొన్నారు. ఎన్‌పీఏల విషయంలో తగిన పరిష్కారానికి ఆర్‌బీఐ పదే పదే ప్రయత్నాలు చేసినప్పటికీ బ్యాంకుల నుంచి వచ్చిన స్పందన తక్కువగానే ఉన్నట్టు రాజన్‌ వెల్లడించారు. ‘‘బ్యాంకులు సమస్యలను గుర్తించేందుకు విముఖంగా ఉన్నాయని గమనించాం. దీంతో ఖాతాల ప్రక్షాళనకు వాటిపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాం. ఆస్తుల నాణ్యత సమీక్ష కార్యక్రమం 2015లో ప్రారంభం అయింది. భారత్‌లో ఈ తరహా అతిపెద్ద కార్యక్రమం ఇదే’’ అని రాజన్‌ తన పుస్తకంలో వివరించారు.

మరిన్ని వార్తలు