ఫోన్ కాల్స్‌తో కొల్లగొట్టేస్తారు..

30 Mar, 2014 03:30 IST|Sakshi

విశాల్ సాల్వి
చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

 
టెక్నాలజీతో పాటే మోసాలు కూడా పెరిగిపోయాయి. అప్రమత్తంగా వ్యవహరించకపోతే బ్యాంకు అకౌంట్లోని సొమ్ము మాయమయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదెలాగంటే... మీకు సడన్‌గా ఓ వ్యక్తి ఫోన్ చేస్తాడు. బ్యాంకు, పెద్ద కంపెనీ లేదా రిజర్వు బ్యాంకు ప్రతినిధినని పరిచయం చేసుకుంటాడు. మీ బ్యాంకు అకౌంటు నంబరు, పాస్‌వర్డ్, కస్టమర్ ఐడీ, క్రెడిట్ కార్డు నంబరు, ఏటీఎం పిన్ వంటి సమాచారాన్ని అడుగుతాడు. అతను అడిగినవి చెప్పకపోతే సమస్యలు వస్తాయేమోనన్న భావన పుట్టిస్తాడు. మనం రహస్యంగా ఉంచుకోవాల్సిన సమాచారాన్ని ఈ విధంగా తెలుసుకోవడాన్నే విషింగ్ అంటారు. దీన్నే వాయిస్ ఫిషింగ్ అని కూడా వ్యవహరిస్తారు. ప్రజల నుంచి ఫోన్‌లో సేకరించే సమాచారం ఆధారంగా బ్యాంకు అకౌంట్ల నుంచి, క్రెడిట్ కార్డుల నుంచి సొమ్మును కాజేయడమే మోసగాళ్ల లక్ష్యం.
 
 ఇప్పటికే సమాచారం చెప్పి ఉంటే...
 ఇలాంటి ఫోన్ కాల్స్‌కు స్పందించి, కీలక సమాచారాన్ని అందించిన వారు తక్షణమే నష్ట నివారణ చర్యలు చేపట్టాలి. మీ బ్యాంకు బ్రాంచీని వెంటనే సంప్రదించి, సందేహాస్పదంగా ఉన్న ఫోన్ కాల్ సమాచారాన్ని వారికి చెప్పాలి. మీ అకౌంటును వెంటనే స్తంభింప చేయాలని కోరాలి. మీ ఏటీఎం పిన్, ఫోన్ బ్యాంకింగ్ పిన్, పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చేయాలి. మీ ఖాతాలో ఇటీవల అనధికార లావాదేవీలు ఏమైనా జరిగాయేమో గమనించాలి. మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే తక్షణ స్పందన అవసరం.
 మీకు ఏ నంబరు నుంచి ఫోన్ కాల్ వచ్చింది, అవతలి వ్యక్తి మీ నుంచి ఎలాంటి సమాచారాన్ని తెలుసుకున్నాడు వంటి వివరాలన్నీ గుర్తు తెచ్చుకుని పేపరుపై రాయాలి. తద్వారా, మీ బ్యాంకు బ్రాంచికి నిర్దుష్ట సమాచారాన్ని అందించగలుగుతారు. ఒకవేళ, మీ అకౌంట్లో మోసపూరిత లావాదేవీలు జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
 
 మీకు తెలిసిన సమాచారాన్నంతా పోలీసులకు అందించాలి. ముందు జాగ్రత్త చర్యలు: బ్యాంకు అకౌంటు, క్రెడిట్ కార్డులకు సంబంధించిన ముఖ్య సమాచారాన్ని ఎవరికీ చెప్పవద్దు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే తక్షణమే మీ బ్యాంకు బ్రాంచీని సంప్రదించాలి. వాయిస్ మెయిల్స్, టెక్ట్స్ మెస్సేజీల్లో వచ్చిన నంబర్లకు ఫోన్ చేయవద్దు. బ్యాంకులో మీ లావాదేవీలకు సంబంధించిన స్టేట్‌మెంట్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండండి. మీ మొబైల్ నంబరును, ఈమెయిల్ ఐడీని మీ బ్యాంకు బ్రాంచీలో నమోదు చేయించుకోండి. ఇలా చేయడం వల్ల మీ అకౌంట్లో జరిగే లావాదేవీలపై మీకు వెంటనే అలర్ట్ మెస్సేజీ వస్తుంది. మీ ఫోన్ నంబరు హఠాత్తుగా క్రియారహితంగా (ఇనాక్టివ్‌గా) మారినా, మీ ఫోన్ నుంచి కాల్స్ చేయలేకపోయినా తక్షణమే మీ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్‌కు ఫోన్ చేసి, కారణం తెలుసుకోండి.

మరిన్ని వార్తలు